బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దానం నాగేందర్ ఆఫర్
లోక్‌సభ ఎన్నికల్లో తన కోసం పని చేసిన కార్యకర్తలకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి రావాలంటూ ఆఫర్ ఇచ్చారు.
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ గడ్డు పరిస్థితులు ఎదుర్కుంటోంది. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఓ ఆఫర్ ప్రకటించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా రాజకీయ భవిష్యత్తు కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీలోకి రావాలని.. సీఎం రేవంత్ రెడ్డి తగిన గౌరవం ఇస్తారంటూ ఆహ్వానం పలికారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన దానం నాగేందర్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఆయన సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలోనే లోక్‌సభ ఎన్నికల్లో తన కోసం పని చేసిన కార్యకర్తలకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి రావాలంటూ ఆఫర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీకి డిపాజిట్ రాలేదన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాలు గెలుచుకుంది. ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పేసుకున్నారు. వీరిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఉన్నారు. మరికొందరు కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.