అందుకే నాకు బూతులొచ్చాయ్..
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనని రెచ్చగొట్టారని, అందుకే తనకు హైదరాబాద్ లాంగ్వేజ్ వచ్చిందని చెప్పుకొచ్చారు దానం నాగేందర్.
అసెంబ్లీలో బూతులు మాట్లాడిన ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్.. తన మాటలకు విచిత్రమైన వివరణ కూడా ఇచ్చారు. తనని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెచ్చగొట్టారని, అందుకే తనకు హైదరాబాద్ లాంగ్వేజ్ వచ్చిందని చెప్పుకొచ్చారు. తానేమీ తప్పు మాట్లాడలేదని, తప్పంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలదేనని చెప్పుకునే ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్ రెడ్డితోపాటు తనను కూడా కించపరిచే ప్రయత్నం చేశారని, తనని కావాలనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టార్గెట్ చేశారన్నారు దానం.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన దానం నాగేందర్ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. అయితే బూతులు మాట్లాడినా తన తప్పేమీ లేదని ఆయన చెప్పడం విశేషం. సభకు స్పీకర్ అధిపతి అని, ఆయన అవకాశం ఇచ్చారు కాబట్టే తాను మాట్లాడానన్నారు. హైదరాబాద్ పట్ల, దళితుల పట్ల, ఇతర అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రతిపక్షం స్పందించలేదని తప్పించుకు పోవాలని చూసిందని, అందుకే తాను అలా మాట్లాడాల్సి వచ్చిందన్నారు దానం. అధికారం ఉంటుంది పోతుందని, అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని చెప్పారు.
దానం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పవిత్రమైన అసెంబ్లీలో ఆ భాష ఏంటని ప్రశ్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సభ బయట అలాంటి వ్యాఖ్యలు చేశారని, దాన్ని ఆదర్శంగా తీసుకుని దానం సహా ఇతర నేతలు ఏకంగా సభలోనే రెచ్చిపోతున్నారని అన్నారు. అటు సోషల్ మీడియాలో కూడా దానంపై ట్రోలింగ్ మొదలైంది. అయితే దానం మాత్రం తన వ్యాఖ్యల్ని సమర్థించుకోవడం, పైగా తప్పంతా బీఆర్ఎస్ నేతలదేనని చెప్పడం మరో విశేషం.