Telugu Global
Telangana

కేసీఆర్ గొప్ప నాయకుడే, కానీ..! దానం సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ ని గొప్ప నాయకుడు అని అన్న దానం.. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై కూడా సూటిగా స్పందించలేదు. కాంగ్రెస్ నేతలు కవిత అరెస్ట్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న సందర్భంలో అదే పార్టీలో చేరిన దానం మాత్రం సంయమనం పాటించడం విశేషం.

కేసీఆర్ గొప్ప నాయకుడే, కానీ..! దానం సంచలన వ్యాఖ్యలు
X

బీఆర్ఎస్ టికెట్ పై ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ఇటీవల కాంగ్రెస్ లో చేరి హస్తం గుర్తుపై సికింద్రాబాద్ లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ మారిన సమయంలో కానీ, ఆ తర్వాత కానీ దానం, బీఆర్ఎస్ పై పెద్దగా విమర్శలు చేయలేదు. తాజాగా ఆయన తన పాత పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గొప్ప నాయకుడు అంటూనే.. ఆయన పక్కన ఉన్నవారు తప్పుదోవ పట్టించారని, పార్టీని నాశనం చేశారని మండిపడ్డారు దానం నాగేందర్.

కాంగ్రెస్ టికెట్ పై సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి పార్లమెంట్ కి వెళ్తానని అన్నారు దానం నాగేందర్. తన అభ్యర్థిత్వం పై కేటీఆర్ న్యాయస్థానానికి వెళితే తాను కూడా న్యాయస్థానంలోనే సమాధానం చెబుతానని బదులిచ్చారు. గతంలో బీఆర్ఎస్ వాళ్లు చేసింది న్యాయమే అయితే.. ఇప్పుడు తాను చేసింది కూడా కరెక్టేనని చెప్పారు దానం. ముఖ్యమంత్రిపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని వెనకేసుకు వచ్చారు దానం.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి రూ.3500 కోట్లు సంపాదించారని ప్రతిపక్షాలు నిందలు వేస్తున్నాయని.. అంటే గత పదేళ్లుగా అధికారంలో ఉన్నవారు ఎన్ని లక్షల కోట్లు సంపాదించారని ప్రశ్నించారు దానం నాగేందర్. ఆస్తులు కాపాడుకోవడానికే తాను పార్టీ మారినట్లు వస్తున్న ఆరోపణలను ఖండించారు. బీఆర్ఎస్ లో చేరిన తర్వాత తాను ఆస్తులు కూడాపెట్టినట్టు నిరూపిస్తే అంతా వదులుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. బీఆర్ఎస్ లో తాను కార్యకర్తలాగానే పని చేశానని, ఇప్పుడు కూడా ఓ కార్యకర్తలాగానే పని చేస్తూ ఎంపీగా పోటీకి సిద్ధమయ్యానని చెప్పారు దానం.

బీఆర్ఎస్ పై ఆరోపణలు చేసిన దానం, కేసీఆర్ కుటుంబం గురించి పల్లెత్తు మాట అనకపోవడం విశేషం. కేసీఆర్ ని గొప్ప నాయకుడు అని అన్న దానం.. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై కూడా సూటిగా స్పందించలేదు. ఒక ఆడబిడ్డ అరెస్ట్ గురించి తాను మాట్లాడలేనని చెప్పారు దానం. కాంగ్రెస్ నేతలు కవిత అరెస్ట్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న సందర్భంలో అదే పార్టీలో చేరిన దానం మాత్రం సంయమనం పాటించడం విశేషం.

First Published:  27 March 2024 10:00 AM IST
Next Story