'బలగం' మొగిలయ్యకు దళిత బంధు..
నాయకులు స్పందించారు. ఆయన పరిస్థితి తెలుసుకుని దళితబంధు మంజూరు చేయించేందుకు కృషి చేశారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో దళితబంధు మంజూరైంది.
బలగం సినిమాలో బుర్రకథతో అందరికీ సుపరిచితుడైన పస్తం మొగిలయ్యకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితబంధుతో అండగా నిలిచింది. వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య.. మొగిలయ్యకు దళిత బంధు మంజూరు పత్రాన్ని అందజేశారు. ఆయనను శాలువాతో సత్కరించారు. తమ కష్టాలు తెలుసుకుని అండగా నిలిచిన ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు, దళిత బంధు మంజూరు చేయడంలో చొరవ చూపించిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.
బలగంతో వెలుగులోకి..
వరంగల్ జిల్లా దుగ్గొండి గ్రామానికి చెందిన బుడగ జంగాల కళాకారుడు మొగిలయ్య. కుటుంబంతో సహా ఊరూరా తిరుగుతూ యక్షగానాలు, బుర్రకథలు చెప్పుకుంటూ జీవనం సాగిస్తుంటారు మొగిలయ్య. అనుకోకుండా బలగం సినిమాతో వచ్చిన అవకాశం ఆయనకు ఎక్కడలేని పేరు తెచ్చిపెట్టింది. కానీ అప్పటికే ఆయన ఆరోగ్యం పాడైంది. రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో రెండేళ్లుగా మొగిలయ్య డయాలసిస్ చేయించుకుంటున్నారు. బలగం సినిమా విడుదలైన తర్వాత కొన్నిరోజులకు ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఆస్పత్రిలో చేరారు.
మొగిలయ్య ఆస్పత్రిలో చేరిన తర్వాత మీడియా ఆయనపై కథనాలిచ్చింది. బలగం సినిమాకి తన పాటతో ఆయువుపట్టుగా నిలిచిన మొగిలయ్య దీనగాథను వెలుగులోకి తెచ్చింది. దీంతో నాయకులు స్పందించారు. ఆయన పరిస్థితి తెలుసుకుని దళితబంధు మంజూరు చేయించేందుకు కృషి చేశారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో దళితబంధు మంజూరైంది.