Telugu Global
Telangana

దోపిడిని అరికట్టే పథకం దళిత బంధు.. కేసీఆర్ ఆచరణ దేశానికి స్పూర్తి : ప్రకాశ్ అంబేద్కర్

అంబేద్కర్ ఆశయాలను సీఎం కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన ప్రశంసించారు. అతి చిన్న కులాలు ఎన్నో సమస్యలు ఎదుర్కుంటున్నాయని.. వాళ్లకు కూడా ప్రభుత్వం తరపున తగిన ప్రోత్సాహం ఉండాలని ప్రకాశ్ అంబేద్కర్ ఆకాంక్షించారు.

దోపిడిని అరికట్టే పథకం దళిత బంధు.. కేసీఆర్ ఆచరణ దేశానికి స్పూర్తి : ప్రకాశ్ అంబేద్కర్
X

అంబేద్కర్ విగ్రహావిష్కరణ మరో చరిత్రకు నాంది పలికిందని ప్రకాశ్ అంబేద్కర్ అన్నారు. హైదరాబాద్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రకాశ్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1923లోనే రూపాయి సమస్యపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పరిశోధనా పత్రాన్ని రాశారని, అందులో బ్రిటిషర్లు ఇండియాను ఎలా దోచుకుంటున్నారో వివరించారని చెప్పారు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు అయినా దోపిడీ మాత్రం ఆగలేదని అన్నారు. ఇప్పటికీ వస్తోత్పత్తి రంగంలో దళితులు, ఆదివాసీలకు చోటే లేకుండా పోయిందన్నారు. ఉత్పత్తి రంగంలో కూడా అణగారిన వర్గాలకు చోటు లేదు. మనం కొనే వాళ్లుగానే ఉంటున్నాం.. కానీ ఉత్పత్తి, అమ్మకందార్లుగా ఉండటం లేదన్నారు. కానీ ఇలాంటి దోపిడీని అరికట్టే అద్భుతమైన పథకమే దళిత బంధు అన్నారు.


ఆర్థిక దుర్భలత్వంపై పోరాడేందుకు సీఎం కేసీఆర్ రూపొందించిన దళిత బంధు ఉపయోగపడుతుందని చెప్పారు. దళిత బంధు పథకం ద్వారా సీఎం కేసీఆర్ సమాజానికి కొత్త దిశను చూపించారని తెలిపారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అయినా.. అంబేద్కర్ కలలు కన్న స్వరాజ్యం ఇంకా దూరంగానే ఉందని చెప్పారు. ఆదివాసీలు, దళితులు వృద్ధి లోకి రావల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే అసమానతలు తొలగించ వచ్చని అంబేద్కర్ విశ్వసించారని చెప్పారు. ఇప్పుడు బలిదానాలు జరుగకుండా కొత్త రాష్ట్రాలు ఏర్పడే పరిస్థితి లేదని ప్రకాశ్ అంబేద్కర్ అభిప్రాయపడ్డారు.

అంబేద్కర్ ఆశయాలను సీఎం కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన ప్రశంసించారు. అతి చిన్న కులాలు ఎన్నో సమస్యలు ఎదుర్కుంటున్నాయని.. వాళ్లకు కూడా ప్రభుత్వం తరపున తగిన ప్రోత్సాహం ఉండాలని ప్రకాశ్ అంబేద్కర్ ఆకాంక్షించారు. కేసీఆర్ ఇక్కడ అమలు చేస్తున్న దళిత బంధు దేశానికే స్పూర్తిగా నిలిచిందని చెప్పారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇలాంటి పథకాన్ని అమలు చేయాలని ఆయన కోరారు.

ఆనాడు చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అంబేద్కర్ మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ కోసం ఎంతో పోరాటం జరిగింది. కేసీఆర్ రాష్ట్ర సాధనలో సఫలం అయ్యారని చెప్పారు. ఇక దేశానికి రక్షణ సమస్య వస్తే మరో రాజధాని అవసరమని బీఆర్ అంబేద్కర్ చెప్పారు. రెండో రాజధానిగా హైదరాబాద్ సరైన నగరమని కూడా అన్నారు. పాకిస్తాన్, చైనా నుంచి హైదరాబాద్ దూరంగా ఉంది, ఇది ఎంతో సురక్షితమైన నగరం అని కూడా అంబేద్కర్ చెప్పిన విషయాన్ని ప్రకాశ్ అంబేద్కర్ గుర్తు చేశారు.

దేశంలో ఇప్పుడు జాతీయ నాయకులు ఎవరూ లేరు. వాజ్‌పాయి తర్వాత నిజమైన జాతీయ నాయకుడు ఎవరూ రాలేదని ప్రకాశ్ అంబేద్కర్ చెప్పారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన పథకాలు చూస్తే.. ఇక్కడి నుంచి ఒక జాతీయ నాయకుడు రావల్సిన అవసరం ఉందని చెప్పారు. సీఎం కేసీఆర్ తప్పకుండా ఈ దేశానికి ఒక స్పూర్తిగా నిలుస్తారని ప్రకాశ్ అంబేద్కర్ పేర్కొన్నారు. అంతకు ముందు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్‌తో కలిసి ప్రకాశ్ అంబేద్కర్ ఆవిష్కరించారు.

First Published:  14 April 2023 12:11 PM GMT
Next Story