రూపాయి లంచం ఇవ్వొద్దు.. దళితులు ధనికులు కావాలనేదే దళిత బంధు పథకం లక్ష్యం : మంత్రి కేటీఆర్
దళితులు ధనికులు కావాలనే మంచి లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు.
దళిత బంధు లబ్ధిదారులు ఎవరు కూడా రూపాయి లంచం ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం రూ.10 లక్షల ఇచ్చేది సంపద పునరుత్పత్తి చేయాలనే.. దళితులు ధనికులు కావాలనే మంచి లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని మంత్రి చెప్పారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఎమ్మెల్యే చిన్నయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి పాల్గొని, మాట్లాడుతూ.. గతంలో ఈ నియోజకవర్గంలో 100 మందికి దళిత బంధు లభించింది.ఈ సారి 1000 మందికి ఆ పథకం ద్వారా సాయం అందనున్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు.
ఇంతకు ముందే ఈ నియోజకవర్గంలో ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీని రూ.2వేల కోట్లతో విస్తరించే పనులకు శంకుస్థాపన చేశాను. అది పూర్తయితే మరో 4000 మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి. అయితే, యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేలా ఒక కేంద్రాన్ని నెలకొల్పాలని స్థానిక శాసన సభ్యులు అడిగారు. త్వరలోనే స్కిల్ డెవలెప్‌మెంట్ సెంటర్ నెలకొల్పే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. అంతే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా త్వరలో రాబోతున్నాయి. ఇప్పుడు 27 కంపెనీలు సదరు ప్రాసెసింగ్ యూనిట్లలో తమ కార్యకలాపాలు సాగించడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాయని మంత్రి చెప్పారు.
ఐటీ సంస్థలను చూసి ఆశ్చర్యపోయాను..
బెల్లంపల్లిలో ఐటీ కంపెనీలను చూసి తనకు చాలా ఆశ్చర్యం వేసిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇక్కడ కార్యకలాపాలు కొనసాగిస్తున్న వాల్యూపిచ్, సనాతన అనలైటిక్స్, రిక్రూట్‌మెంట్ సర్వీసెస్ కంపెనీలను సందర్శించాను. అక్కడి కంపెనీ ఉద్యోగులతో ఇంటరాక్ట్ అయ్యారు. స్థానిక సింగరేణిలో పని చేసే ఉద్యోగుల బిడ్డలే ఈ కంపెనీలను నెలకొల్పారు. దాదాపు 250 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయమని మంత్రి చెప్పారు. బెంగళూరు, హైదరాబాద్ ఐటీ కంపెనీల్లో పనిచేసే యువత టాలెంట్‌కు బెల్లంపల్లి , మంచిర్యాల యువతకు ఎలాంటి తేడా లేదని కేటీఆర్ అన్నారు.
ఒక్క చాన్స్ ఎందుకు ఇవ్వాలి..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి చెందింది. 55 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏనాడూ ఇలాంటి అభివృద్ధి చేయలేదు. కానీ, ఇప్పుడు ఆ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. అన్నేళ్లు ఛాన్స్ ఇచ్చినా ఏం చేశారని.. కేటీఆర్ ప్రశ్నించారు. బెల్లంపల్లి, సింగరేణి ప్రజలు కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయ మాటలను నమ్మవద్దని.. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మరోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
సిలిండర్ రూ.200 చేస్తానన్న హామీ ఏమయ్యింది?
మన్మోహన్ సింగ్ ప్రధాని మంత్రిగా ఉన్న రోజుల్లో సిలిండర్ రూ.400 ఉండేది. అప్పట్లో నరేంద్ర మోడీ, బీజేపీ నాయకులు ఎన్నో విమర్శలు చేశారు. తాను అధికారంలోకి వస్తే సిలిండర్ రూ.200కు ఇస్తానని మోడీ హామీ ఇచ్చారు. కానీ ఈనాడు సిలిండర్ ధర రూ.1200కు చేరింది. అప్పట్లో మన్మోహన్ సింగ్‌ను ఇష్టం వచ్చినట్లు తిట్టిన ఇదే బీజేపీని.. మనం ఎన్ని తిట్లు తిట్టాలని ప్రశ్నించారు. జన్‌ధన్ ఖాతాలు తెరిస్తే రూ.15 లక్షలు ఖాతాల్లో వేస్తానని మభ్య పెట్టి గెలిచారు. ఇప్పటి వరకు ఎవరి ఖాతాలో కూడా రూపాయి పడలేదని.. కేవలం మోడీ ఫ్రెండ్ అదానీ ఖాతాల్లోనే ఆ ధనమంతా పడిందని ఎద్దేవా చేశారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
బెల్లంపల్లిలో పర్యటించిన మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దేవాపూర్‌లోని ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణ పనులకు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం బెల్లంపల్లిలో రూ.30 కోట్లతో చేపట్టిన రోడ్ల నిర్మాణానికి, రూ.44 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పనులకు శంకుస్థాపన చేశారు. బెల్లంపల్లి పాలిటెక్నిక్ కాలేజీలో ఎస్సీ, ఎస్టీ వసతి గృహాన్ని ప్రారంభించారు. కాగా, సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల పర్యావరణ కాలుష్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి యాజమాన్యాన్ని కోరారు. కొత్త ప్లాంట్‌లో దేవాపూర్ గ్రామస్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పారు.
Live: BRS Working President, Minister Sri @KTRBRS addressing a Public Meeting in Bellampally. https://t.co/TruBc55Hqy
— BRS Party (@BRSparty) May 8, 2023
Industries Minister @KTRBRS along with Minister @IKReddyAllola laid the foundation stone for the expansion of Orient Cement Limited at Devapur, Mancherial.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 8, 2023
Expansion of the existing cement manufacturing unit with an investment of Rs 2,000 Crores will directly and indirectly… pic.twitter.com/zKtMjTGDnZ