Telugu Global
Telangana

ఆ రెండు మండలాల్లో ప్రతీ ఎస్సీ కుటుంబానికి దళిత బంధు వెంటనే అమలు : మంత్రి కేటీఆర్

రెండు మండలాల్లో వెంటనే దళిత బంధు లబ్ధిదారులను గుర్తించాలని అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చినట్లు కేటీఆర్ వివరించారు.

ఆ రెండు మండలాల్లో ప్రతీ ఎస్సీ కుటుంబానికి దళిత బంధు వెంటనే అమలు : మంత్రి కేటీఆర్
X

తెలంగాణలోని ఎస్సీలు స్వతంత్రంగా ఎదగాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దళిత బంధును ప్రవేశపెట్టారు. ఇంతకు ముందు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ నన్ను ఒక విషయం అడిగారు. మా నియోజకవర్గాల్లోని సత్తుపల్లి, బోనకల్లు మండలాల్లో ఉన్న అన్ని ఎస్సీ కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలని కోరారు. గతంలో సీఎం కేసీఆర్ చింతకాని పర్యటనకు వచ్చిన సమయంలో అందరికీ ఇచ్చారు. అప్పుడే బోనకల్లు మండలంలో కూడా దళితబంధు అందరికీ ఇస్తామని కేసీఆర్ చెప్పారు.

ఇంతకు ముందే సీఎం కేసీఆర్‌తో ఈ విషయం మాట్లాడాము. సత్తుపల్లి, బోనకల్లులోని అన్ని ఎస్సీ కుటుంబాలకు దళిత బంధు వెంటనే మంజూరు చేస్తామని మాట ఇచ్చినట్లు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ రెండు మండలాల్లో వెంటనే దళిత బంధు లబ్ధిదారులను గుర్తించాలని అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చినట్లు కేటీఆర్ వివరించారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా సత్తుపల్లిలో జరిగిన ప్రగతి నివేదన సభలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

సత్తుపల్లిలోని ఎన్టీఆర్ కాలువ ద్వారా నీళ్లు ఇవ్వమని కోరారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే సత్తుపల్లి నియోజకవర్గంలో సాగు, తాగు నీటి బాధ తప్పుతుందని కేటీఆర్ చెప్పారు. ఆనాడు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటింది ఎన్టీఆర్ అయితే.. ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది మన కేసీఆర్ అని అన్నారు. అందరూ తప్పకుండా కారు గుర్తుకు ఓటేసి సండ్ర వెంకటవీరయ్యను గెలిపించడమే కాకుండా.. సీఎం కేసీఆర్‌ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.

పొంగులేటి, తుమ్మలపై విమర్శలు..

ఒక వ్యక్తి ఓడిపోతే పిలిచి మంత్రి పదవి ఇచ్చి, పార్టీలో సముచిత స్థానం ఇస్తే.. ఇప్పుడు బయటకు వెళ్లి సీఎం కేసీఆర్‌ను తిడుతున్నారని తుమ్మలపై మండిపడ్డారు. ఇంకో వ్యక్తి కేసీఆర్‌ను దేవుడని పొగిడి.. ఇప్పుడు బయటకు వెళ్లి కేసీఆర్ దుర్మార్గుడని ప్రచారం చేస్తున్నారని పొంగులేటిని ఉద్దేశించి అన్నారు. వీరిద్దరు నాయకులు బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు కేసీఆర్ దేవుడిలా కనపడ్డాడు. కానీ ఇప్పుడు తమ సొంత ప్రయోజనాల కోసం బయటకు వెళ్లి.. కేసీఆర్‌ను తిడుతున్నారని మండిపడ్డారు. వీరిద్దరూ సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన వారే.. ఇప్పుడు కర్ణాటక నుంచి వచ్చే డబ్బుల మూటలు పట్టుకొని వచ్చి, ప్రజలకు పంచి గెలవాలని కుట్రలు పన్నుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇలాంటి వారి మాటలు నమ్మవద్దని.. పని చేసే నాయకుడైన సండ్ర వెంకటవీరయ్యను గెలిపించాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీవి అన్నీ దింపుడు కల్లం ఆశలని చెప్పుకొచ్చారు. చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని బతికించడానికే ఆరు గ్యారెంటీలని చెబుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. చనిపోయిన వ్యక్తి లేస్తాడేమో అని చెవుల్లో కొన్ని మంత్రాలు చదువుతారు. ఇప్పుడు కాంగ్రెస్‌ను బతికించడానికి ఆరు గ్యారెంటీలని చదువుతున్నారని చెప్పారు. తెలంగాణకు గ్యారెంటీ, వారెంటీ కేసీఆర్ మాత్రమే అని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు, నీళ్లు ఉండవు.. మళ్లీ అప్పటి చీకటి రోజుల్లోకే వెళ్లాల్సి వస్తుందని చెప్పారు.

ఆశావర్కర్లు ఆలోచించుకోవాలి..

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే ఆశా వర్కర్లకు ఎక్కువగా గౌరవ వేతనాలు ఇస్తున్నామని కేటీఆర్ చెప్పారు. కరోనా సమయంలో ఎంతో సేవ చేశారు. ఆరోగ్య కార్తకర్తల సేవలను సీఎం కేసీఆర్ మరువలేదని అన్నారు. ఇక అంగన్ వాడీ టీచర్లు, వర్కర్లకు మోడీ ప్రభుత్వం తమ వాటా ఇవ్వకపోయినా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం సొంత నిధులు వెచ్చించి వారికి జీతాలు ఇస్తున్నదని అన్నారు. ఈ రోజు సమ్మె చేస్తున్న మీరు ఈ విషయంపై మరోసారి ఆలోచించుకోవాలని అన్నారు. రాబోయేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే.. అప్పడు మరింత మెరుగైన జీతాలు వస్తాయని కేటీఆర్ ప్రకటించారు.

తెలంగాణ వచ్చిన తర్వాత 10 జిల్లాలను 33 జిల్లాలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే. చాలా మంది సత్తుపల్లిని కూడా జిల్లా చేయమని కోరుతున్నారు. కేసీఆర్ మరో సారి సీఎం కాగానే ఆ డిమాండును కూడా తప్పకుండా పరిశీలిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.

First Published:  30 Sept 2023 6:01 PM IST
Next Story