Telugu Global
Telangana

రోడ్డుకి ఇరువైపులా సైకిల్ ట్రాక్ లు.. టార్గెట్ 709 కిలోమీటర్లు..

కేబీఆర్‌ పార్కు, హైటెక్స్‌, మియాపూర్‌ ప్రాంతాల్లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా ట్రాక్ లు ఏర్పాటు చేశారు. దశల వారీగా నగరంలోని అన్ని రోడ్లకు అనుబంధంగా సైకిల్ ట్రాక్ లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

రోడ్డుకి ఇరువైపులా సైకిల్ ట్రాక్ లు.. టార్గెట్ 709 కిలోమీటర్లు..
X

ఇటీవల హైదరాబాద్ లో సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ నిర్మాణాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. తాజాగా ఇప్పుడు నగరంలోని రోడ్లపై కూడా సైకిల్ ట్రాక్ లకు ప్రత్యేకంగా ఖాళీ వదిలేలా జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. వాహన కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు, నగర జీవుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సైకిల్ ట్రాక్ లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు అధికారులు. కేబీఆర్‌ పార్కు, హైటెక్స్‌, మియాపూర్‌ ప్రాంతాల్లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా ట్రాక్ లు ఏర్పాటు చేశారు. దశల వారీగా నగరంలోని అన్ని రోడ్లకు అనుబంధంగా సైకిల్ ట్రాక్ లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఖైరతాబాద్‌ జోన్‌ పరిధిలో కేబీఆర్‌ పార్కు వద్ద, శేరిలింగంపల్లి జోన్‌ లో హైటెక్స్‌ వద్ద, కూకట్‌ పల్లి జోన్‌ లో మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ వద్ద ఇప్పటికే ప్రయోగాత్మకంగా ట్రాక్‌ లు తీర్చిదిద్దారు. వీటికి ప్రజాదరణ ఎంత ఉంది అనే విషయాన్ని పక్కనపెడితే.. ప్రచారం కల్పిస్తే కచ్చితంగా ప్రజల్లో మార్పు వస్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ముందుగా ప్రభుత్వ సిబ్బందికి అలవాటు చేస్తే ఆ తర్వాత సాధారణ ప్రజలు కూడా ఈ ట్రాక్ లకు అలవాటు పడతారనేది అధికారుల ఆలోచన.

కాంప్రహెన్సివ్‌ రోడ్‌ మెయింటెనెన్స్‌ ప్రోగ్రామ్‌ ద్వారా నగరంలో ఉన్న 709 కిలోమీటర్ల రోడ్లకు ఇరువైపులా సైకిల్ ట్రాక్ లకు ప్రత్యేకంగా ఖాళీ ప్రదేశాన్ని వదిలిపెట్టబోతున్నారు. ఇందులో భాగంగా లంగర్‌ హౌస్‌ లోని టిప్పుఖాన్‌ వంతెన నుంచి నానల్‌ నగర్‌ కు వెళ్లే దారిలో 100 మీటర్ల పొడవునా ట్రాక్‌ నిర్మించారు. ఇప్పటి వరకు ఉన్న 4 ప్రాంతాల్లో సైకిల్‌ ట్రాక్ ల పనితీరు పరిశీలించి నగరవ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తెస్తామంటున్నారు అధికారులు. ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. హైదరాబాద్ కి మరో అరుదైన గుర్తింపు వస్తుంది. అదే సమయంలో కాలుష్య ప్రభావం కూడా తగ్గుతుంది. ప్రజలకు ఆరోగ్యంపై మరింత అవగాహన పెరుగుతుంది.

First Published:  30 Sept 2022 12:50 PM IST
Next Story