Telugu Global
Telangana

భారీ వర్షాలు.. ఐటీ కంపెనీలకు తెలంగాణ పోలీస్ సూచనలు

హైటెక్ సిటీ పరిధిలో సాయంత్రం వేళ ట్రాఫిక్ జామ్ కు విరుగుడు సూచిస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. ఉద్యోగులు మూడు అంచెల్లో లాగ్ అవుట్ చేసేలా షిఫ్ట్ వేళలను సర్దుబాటు చేసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేశారు.

భారీ వర్షాలు.. ఐటీ కంపెనీలకు తెలంగాణ పోలీస్ సూచనలు
X

భారీ వర్షాలకు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది, ముఖ్యంగా సాయంత్రం వేళ ఆఫీస్ లు వదిలే సమయంలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమయంలో అందరూ ఒకేసారి రోడ్లపైకి వచ్చేస్తారు, ఇంటికెళ్లే హడావిడిలో ఉంటారు. దీంతో ట్రాఫిక్ సమస్య పెద్దదవుతోంది. దీన్ని నివారించడానికి వర్షాలుపడే రోజుల్లో సైబరాబాద్ పోలీసులు ఓ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. ఐటీ కంపెనీలకు కీలక సూచనలు చేశారు.

హైటెక్ సిటీ పరిధిలో సాయంత్రం వేళ ట్రాఫిక్ జామ్ కు విరుగుడు సూచిస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. ఉద్యోగులు మూడు అంచెల్లో లాగ్ అవుట్ చేసేలా షిఫ్ట్ వేళలను సర్దుబాటు చేసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేశారు. మంగళ, బుధవారాల్లో లాగ్ అవుట్ సమయాలు పాటించాలని సూచించారు పోలీసులు.

ఫేజ్ - 1

ఐకియా నుంచి సైబర్ టవర్స్ వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 గంటలకు లాగ్ అవుట్ చేసుకోవాలి.

ఫేజ్ - 2

ఐకియా నుంచి బయో డైవర్సిటీ, రాయదుర్గం వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 4:30 గంటలకు లాగ్ అవుట్ చేసుకోవాలి.

ఫేజ్ - 3

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 6 గంటలకు లాగ్ అవుట్ చేసుకోవాలని సైబరాబాద్‌ పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.


ఐటీ ఉద్యోగులంతా దాదాపుగా వ్యక్తిగత వాహనాలు వినియోగిస్తుంటారు. ఆఫీస్ అయిపోగానే ఒక్కసారిగా వాహనాలతో బయటకు వచ్చేస్తారు. సాధారణ రోజుల్లో పర్లేదు, వర్షాలకు ట్రాఫిక్ కాస్త ఆగిపోతే.. వాహనాల వల్ల అది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. అయితే మూడు దశల్లో ఉద్యోగులు విడతల వారీగా బయటకు వస్తే ఏ ఒక్కరూ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కోకుండా ఇళ్లకు వెళ్లే అవకాశముంటుందని చెబుతున్నారు పోలీసులు. సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోకి వచ్చే ఐటీ కంపెనీలు ఈ నిబంధనలు పాటించాలని సూచించారు.

First Published:  26 July 2023 6:10 AM IST
Next Story