సమగ్ర కుటుంబ సర్వేపై సైబర్ నేరగాళ్ల కన్ను
సర్వే పేరుతో వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లను ఎట్టిపరిస్థితుల్లో నమ్మవద్దంటున్న పోలీసులు
సైబర్ నేరగాళ్లు ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు. ఇటీవల మూసీ సుందరీకరణలో భాగంగా నిర్వాసితులకు పరిహారం పేరుతో మోసగించేందుకు యత్నించారు. తాజాగా కుటుంబ సర్వేనూ అస్త్రంగా మార్చుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సమగ్ర సర్వేపై సైబర్ నేరగాళ్ల కన్ను పడింది. ఆన్‌లైన్ సర్వలో చేస్తున్నామని పత్రాలు పంపమంటూ మోసగించడానికి ప్రయత్నిస్తున్నారు. సర్వేలో భాగంగా కాల్ చేస్తున్నామని పత్రాలు ఇవ్వాలంటూ ఫేక్ కాల్స్ చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ తరహా కేసులపై ఇప్పటివరకు కేసులు నమోదు కాకున్నా సర్వే పేరుతో వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లను ఎట్టిపరిస్థితుల్లో నమ్మవద్దని పోలీసులు ప్రచారం చేస్తున్నారు. కుటుంబ సర్వేలో భాగంగా సిబ్బంది నేరుగా ఇళ్లలోకి వచ్చి వివరాలు నమోదు చేసుకుంటారని తెలిపారు. పనులు, ఉద్యోగాలు, టూర్ల వల్ల కొంతమంది నిత్యం ప్రయాణం చేస్తుంటారు. సర్వే ఎప్పుడు పూర్తవుతుందో అని ఎదురుచూస్తుంటారు. ఇలాంటి వారినే సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసుకునే అవకాశం ఉన్నదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి సర్వే పేరుతో వచ్చే ఫోన్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
అలాంటి ఫోన్ కాల్స్, మెసేజ్‌లు వస్తే బాధితులు వెంటనే 1930కి కాల్ చేయాలని పోలీసులు సూచించారు. కొంతమంది సర్వే చేస్తున్నామని ఆధార్, పాన్ తదితర పత్రాలు పంపాలని, లేకపోతే తాము పంపించే లింక్ క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. వాట్సప్‌కు వెబ్ లింక్‌లు, ఏపీకే లింక్‌లు పంపిస్తారని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.