Telugu Global
Telangana

4G నుంచి 5G.. అదో పెద్ద బురిడీ

మీరు మా ప్రియమైన కస్టమర్ అందుకే అతి తక్కువ ధరకే మీకు 4G నుంచి 5Gకి మారే అవకాశం కల్పిస్తున్నాం. త్వరగా ఈ లింక్ క్లిక్ చేయండి.. అంటూ కొన్ని మెసేజ్ లను సైబర్ మోసగాళ్లు విరివిగా పంపిస్తున్నట్టు తెలుస్తోంది.

4G నుంచి 5G.. అదో పెద్ద బురిడీ
X

భారత్ లో ప్రస్తుతం 5G అనేది హాట్ టాపిక్. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న 4G సేవలు ఇకపై 5Gకి మారబోతున్నాయి. అయితే ఆటోమేటిక్ గా 5G అందుబాటులోకి వస్తుందా, దానికి కస్టమర్లు ఏమైనా చేయాలా అనే విషయంలో చాలామందికి అవగాహన లేదు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ సహా 13 మెట్రో నగరాల్లో మాత్రమే ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 5G కి సపోర్ట్ చేసే ఫోన్లు మాత్రమే ఈ సాంకేతికను మనకు అందించగలవు. వీటిపై అవగాహన లేనివారిని ఈజీగా బురిడీ కొట్టించేస్తున్నారు సైబర్ మోసగాళ్లు.

మీరు మా ప్రియమైన కస్టమర్ అందుకే అతి తక్కువ ధరకే మీకు 4G నుంచి 5Gకి మారే అవకాశం కల్పిస్తున్నాం. త్వరగా ఈ లింక్ క్లిక్ చేయండి.. అంటూ కొన్ని మెసేజ్ లను సైబర్ మోసగాళ్లు విరివిగా పంపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సైబర్ మోసగాళ్ల వలలో పడితే అంతే సంగతులు, ఆ లింకులు క్లిక్ చేస్తే మన ఖాతాలో నగదు మాయం అవుతుంది. ఇలాంటి మెసేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ ప్యాకేజ్‌ (APK) ఫైల్స్‌ ను లింకుల ద్వారా వినియోగదారులకు ఒకేసారి పంపిస్తుంటారు సైబర్ మోసగాళ్లు. అవి మాల్ వేర్ లింకులు. వాటిని క్లిక్ చేస్తే సెల్ ఫోన్ లో తిష్టవేస్తాయి. డేటా చోరీ చేస్తాయి. ఫోన్ లో సేవ్ చేసిన బ్యాంకింగ్ యాప్ ల యూజర్ ఐడీలు, పాస్ వర్డ్ లు అవి చోరీ చేయగలవు. వాటితోపాటు వ్యక్తిగత ఫొటోలు కూడా తరలించేస్తాయి. ఇటీవల కాలంలో ఇలా వ్యక్తిగత ఫొటోలను మార్ఫింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేసే ముఠాలు కూడా ఎక్కువవుతున్నాయి. వీటి ద్వారా మరింత ప్రమాదం ఉంది.

ప్రియమైన కస్టమర్..

వాస్తవానికి 4G నుంచి 5Gకి మారాలంటే సిమ్ మార్చాల్సిన అవసరం లేదు. సెట్టింగుల్లో మార్పులు చేసుకుంటే చాలు. అయితే సైబర్ మోసగాళ్లు మాత్రం.. సిమ్ మార్చాల్సి ఉంటుందని, మీరు మా ప్రియమైన కస్టమర్ కాబట్టి, అలాంటి అవసరం లేకుండానే మీకు 5Gకి మారే అవకాశం కల్పిస్తున్నామని, దానికి నామమాత్రపు రుసుము వసూలు చేస్తున్నామంటూ క్యూఆర్ కోడ్ లు కూడా పంపిస్తున్నారట. ఇలాంటి కోడ్ లు స్కాన్ చేసినా, వారిచ్చిన యూపీఐ ఐడీలకు డబ్బులు పంపించాలని ప్రయత్నించినా.. అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ తో సహా మొత్తం కట్ అయిపోతుంది. ఇలాంటి మెసేజ్ లు ఇప్పటికే మెట్రో సిటీస్ లో మొదలయ్యాయి.

ఎప్పుడు ఏ విషయం ట్రెండింగ్ లో ఉంటుందో, దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని సైబర్ మోసాలు పెరుగుతాయి. ప్రస్తుతం భారత్ లో 5G ట్రెండింగ్ లో ఉంది కాబట్టి, దీన్ని అడ్డు పెట్టుకుని మోసాలకు దిగుతున్నారు కేటుగాళ్లు. ఈ విషయంలో మొబైల్ వినియోగదారులు అలర్ట్ గా ఉండాలని, 5G మోజులో బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు సైబర్ విభాగం పోలీసు అధికారులు.

First Published:  8 Oct 2022 7:43 AM IST
Next Story