మస్కట్ ప్రయాణికురాలి నుంచి కిలోన్నర బంగారం స్వాధీనం
శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా, సదరు ప్రయాణికురాలి వద్ద కిలోన్నర బరువు ఉన్న బంగారం గుర్తించారు.
మస్కట్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికురాలి నుంచి కస్టమ్స్ అధికారులు భారీ స్థాయిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఈ ఘటన జరిగినట్టు వారు వెల్లడించారు. మస్కట్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సోమవారం వచ్చిన ఓ విమానంలో ఒక మహిళా ప్రయాణికురాలు చేరుకుంది.
శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా, సదరు ప్రయాణికురాలి వద్ద కిలోన్నర బరువు ఉన్న బంగారం గుర్తించారు. పక్కా సమాచారంతో ఆమె లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేసినట్టు అధికారులు వెల్లడించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు.. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.
ఆదివారం కూడా రియాద్ నుంచి వచ్చిన వ్యక్తి ఎమర్జెన్సీ లైట్ బ్యాటరీలో దాదాపు కేజీ 200 గ్రాముల బంగారం తీసుకు వచ్చాడు. తనిఖీల్లో బంగారాన్ని గుర్తించిన కస్టమ్స్ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఒక్కరోజు వ్యవధిలోనే మరో మహిళ భారీ స్థాయిలో బంగారంతో పట్టుబడటంతో ఇప్పుడు చర్చనీయాంశమైంది.