Telugu Global
Telangana

కొడుక్కి స్నానం చేయిస్తుండగా కరెంట్‌ షాక్‌! - బాత్‌రూమ్‌లోనే తల్లిదండ్రులు, కొడుకు మృతి

6.30 గంటలకు విజయలక్ష్మి అనే మహిళతో కలసి వెళ్లింది. ఇద్దరూ కలిసి ఇల్లంతా వెతగ్గా.. ఎక్కడా వారు కనిపించలేదు. స్నానాల గది తలుపు మాత్రం దగ్గరగా వేసి ఉండటం, తెరిచేందుకు ప్రయత్నించినా రాకపోవడంతో వాచ్‌మెన్‌ సత్యనారాయణను పిలిచారు.

కొడుక్కి స్నానం చేయిస్తుండగా కరెంట్‌ షాక్‌! - బాత్‌రూమ్‌లోనే తల్లిదండ్రులు, కొడుకు మృతి
X

కొడుక్కి స్నానం చేయిస్తుండగా కరెంట్‌ షాక్‌ కొట్టడంతో తల్లిదండ్రులు, కుమారుడు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని జెక్‌ కాలనీలో ఆదివారం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన ఆర్‌.వెంకటేష్‌ (59) కుటుంబసభ్యులు 2014లో హైదరాబాద్‌కు వచ్చి అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నారు. వెంకటేష్‌ స్థానిక సిగ్నోడ్‌ ట్రాన్సిస్ట్‌ ప్యాకింగ్‌ సొల్యూషన్స్‌ సంస్థలో బిజినెస్‌ యూనిట్‌ హెడ్‌గా పనిచేస్తున్నారు.

ఫ్లాట్‌లో వెంకటేష్, ఆయన భార్య మాధవి (52), కుమారుడు హరికృష్ణ (25) ఉంటున్నారు. కుమారుడికి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో అతని బాగోగులను తల్లిదండ్రులే చూసుకుంటున్నారు. ఆదివారం ఉదయం 11.30 గంటల సమయంలో వారి ఫ్లాట్‌కి పనిమనిషి వరలక్ష్మి వచ్చింది. తలుపులు తీసే ఉండటంతో వంటింట్లో పని పూర్తిచేసుకొని వెళ్లిపోయింది. తిరిగి సాయంత్రం 4 గంటల సమయంలో శనివారం మాధవి ఇచ్చిన ప్లేట్లను ఇవ్వడానికి వెళ్లగా అప్పుడూ ఇంట్లో అలికిడి లేదు.

దీంతో ఆమె మళ్లీ 6.30 గంటలకు విజయలక్ష్మి అనే మహిళతో కలసి వెళ్లింది. ఇద్దరూ కలిసి ఇల్లంతా వెతగ్గా.. ఎక్కడా వారు కనిపించలేదు. స్నానాల గది తలుపు మాత్రం దగ్గరగా వేసి ఉండటం, తెరిచేందుకు ప్రయత్నించినా రాకపోవడంతో వాచ్‌మెన్‌ సత్యనారాయణను పిలిచారు. అతను గట్టిగా ప్రయత్నించడంతో కొంతవరకు తలుపు తెరుచుకుంది. లోపల వెంకటేష్, మాధవి, హరికృష్ణ విగతజీవులై ఉండటాన్ని గుర్తించి వారంతా హతాశులయ్యారు. హరికృష్ణ శరీరంపై దుస్తులు లేవు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కుమారుడికి తరచూ తల్లిదండ్రులే స్నానం చేయిస్తుంటారని అపార్ట్‌మెంట్‌ వాసులు తెలిపారు. ఆ నేపథ్యంలో విద్యుత్‌ షాక్‌ వల్ల ముగ్గురూ మృతిచెంది ఉంటారని భావిస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లో తరచూ ఎర్తింగ్‌ సమస్య వల్ల విద్యుత్‌ షాక్‌లకు గురవుతున్నామని అపార్ట్‌మెంట్‌ వాసులు తెలిపారు. దీనిపై అపార్ట్‌మెంట్‌ కార్యదర్శి డాక్టర్‌ మల్లు ప్రసాద్‌ మాట్లాడుతూ విద్యుత్‌ సమస్యపై ఒకసారి విద్యుత్‌ అధికారులకు ఫిర్యాదు కూడా చేశామని చెప్పారు. ఈ నేపథ్యంలో కుమారుడికి స్నానం చేయిస్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురవడం వల్లే ముగ్గురూ ప్రాణాలు కోల్పోయి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్టుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  22 July 2024 4:03 AM GMT
Next Story