మేడారం హుండీల్లో అంబేడ్కర్ బొమ్మతో కరెన్సీ నోట్లు
భారీ హుండీల లెక్కింపు కార్యక్రమం దాదాపు 10 రోజులపాటు జరుగుతుంది. 2020లో 11 కోట్ల 17 లక్షల రూపాయల కానుకలు వచ్చాయి.
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా ముగిసింది. కోటి మందికి పైగా భక్తులు తరలివచ్చి అమ్మలకు మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు కానుకలు వేసిన హుండీల లెక్కింపు ఈ రోజు ప్రారంభమైంది. మొత్తం 518 హుండీలను లెక్కించడానికి హనుమకొండలోని టీటీడీ కళ్యాణమండపంలో ఏర్పాట్లు చేశారు.
10 రోజులపాటు లెక్కింపు
ఈ భారీ హుండీల లెక్కింపు కార్యక్రమం దాదాపు 10 రోజులపాటు జరుగుతుంది. 2020లో 11 కోట్ల 17 లక్షల రూపాయల కానుకలు వచ్చాయి. 2022లో కరోనా ప్రభావంతో జాతరకు కాస్త తక్కువ స్పందన కనిపించింది. కానుకలు కూడా 10 కోట్ల 91 లక్షల రూపాయలే వచ్చాయి. అయితే ఈసారి జాతరకు రెండు నెలల ముందు నుంచే జనం పోటెత్తిన నేపథ్యంలో హుండీ ఆదాయం బాగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
అంబేడ్కర్ బొమ్మను కరెన్సీపై ముద్రించాలనే డిమాండ్
మొదట ఓపెన్ చేసిన హుండీలలో నకిలీ కరెన్సీ లభ్యమయ్యాయి.. అంబేద్కర్ ఫొటోతో ముద్రించిన నకిలీ వంద రూపాయల నోట్లు బయటపడ్డాయి.. అంబేడ్కర్ బొమ్మను కరెన్సీ నోట్లపై ముద్రించాలని ఇటీవల డిమాండ్లు వినిపిస్తున్నాయి. దాన్ని జనం దృష్టికి తీసుకురావడానికే ఇలా చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.