Telugu Global
Telangana

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలపై సీఎస్ సమీక్ష

గ్రూప్-1 ప‌రీక్ష‌ల‌ను అత్యంత ప‌క‌డ్బందీగా నిర్వ‌హించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారుల‌కు ఆదేశించారు

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలపై సీఎస్ సమీక్ష
X

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను ఎటువంటి పొరపాటు లేకుండా అత్యంత పకడ్బందీగా నిర్వహించాల‌ని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్షించారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 34,383 మంది అభ్యర్థులు హాజరవుతార‌ని తెలిపారు. హెచ్ఎండీఏ ప‌రిధిలో 46 ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. అన్ని ప‌రీక్షా కేంద్రాల వ‌ద్ద ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేయాల‌ని పోలీసు అధికారులను సీఎస్ ఆదేశించారు.

టీజీపీఎస్సీ చైర్మ‌న్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు గ్రూప్-1 మెయిన్స్ ప‌రీక్ష‌లు జ‌రుగుతుండ‌డంతో.. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో అత్యంత జాగ్రత్తగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆధునిక సాంకేతికత, సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ కూడా సవాలుతో కూడుకుంటున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏవిధమైన అపోహలు, పుకార్లకు తావివ్వకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని మహేందర్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ అశోక్‌నగర్‌లో నిన్న రాత్రి గ్రూపు 1 అభ్యర్థులు నిరసనలు తెలిపారు. పాత జీవో 55నే కొనసాగించాలని.. కొత్తగా తీసుకొచ్చిన జీవో 29తో మళ్లీ గ్రూపు 1 పరీక్ష రద్దు అయ్యే అవకాశం ఉంటుందని వెల్లడించారు నిరుద్యోగులు. ఇవాళ తెలంగాణ భవన్ కేటీఆర్ తో కలిసి సమస్యను వివరించారు.

First Published:  17 Oct 2024 4:42 PM IST
Next Story