Telugu Global
Telangana

TSPSCలో ఏపీకి చెందిన వ్యక్తి.. రేవంత్‌ సర్కార్‌పై విమర్శలు

సీఎం రేవంత్ రెడ్డి బావమరిది కృష్ణాజిల్లాకు చెందిన గోలుగూరి వెంకట్ రెడ్డి సిఫార్సు మేరకే రామ్మోహన్‌ రావును TSPSCలో నియమించారని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ఆరోపించారు.

TSPSCలో ఏపీకి చెందిన వ్యక్తి.. రేవంత్‌ సర్కార్‌పై విమర్శలు
X

రెండు రోజుల క్రితం నియామకమైన TSPSC బోర్డులో యరబడి రామ్మోహన్‌ రావుకు స్థానం కల్పించడం వివాదాస్పదమైంది. రామ్మోహన్‌ రావు ఏపీకి చెందిన వ్యక్తి అని, ఆయనను ఎలా నియమిస్తారంటూ విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో కీలకపాత్ర పోషించే TSPSCలో తెలంగాణకు చెందిన వారినే నియమించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

TSPSC ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌ రెడ్డిని నియమించడపైనే విమర్శలు వచ్చాయి. గతంలో ప్రతిపక్షంలో ఉన్న టైమ్‌లో మహేందర్‌ రెడ్డిని తీవ్రంగా విమర్శించిన రేవంత్ రెడ్డి.. మళ్లీ ఆయనకు TSPSC బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమైంది. తాజాగా ఏపీకి చెందిన రామ్మోహన్‌ రావును TSPSCలో సభ్యుడిగా నియమించడం విమర్శలకు దారితీసింది.


రాష్ట్ర విభజన టైమ్‌లో అన్ని సంస్థల ఉద్యోగాలను 58:42 నిష్పత్తిలో విభజించారు. ఇందులో భాగంగా ఏపీ స్థానికంగా ఉన్న 300 మంది ఉద్యోగులను తెలంగాణకు కేటాయించారు. ఉద్యోగులను విభజన చేసిన టైమ్‌లో ప్రతి ఉద్యోగి స్థానికత, కేటాయించిన రాష్ట్రాన్ని కమిటీ పేర్కొంది. అందులో రామ్మోహన్‌ రావును కృష్ణా జిల్లా నందిగామకు చెందిన వాసి అని.. తెలంగాణకు కేటాయిస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే గత ప్రభుత్వం చాలా రోజుల పాటు ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఇటీవల ఆయనకు టీఎస్‌ జెన్‌కో ఈడీగా పోస్టింగ్ ఇచ్చారు. ఏప్రిల్‌లో ఆయన పదవీవిరమణ చేయనున్నారని తెలుస్తోంది. అయితే పదవీ విరమణకు ముందు ఆయనకు TSPSCలో చోటు కల్పించడం చర్చకు దారితీసింది.

సీఎం రేవంత్ రెడ్డి బావమరిది కృష్ణాజిల్లాకు చెందిన గోలుగూరి వెంకట్ రెడ్డి సిఫార్సు మేరకే రామ్మోహన్‌ రావును TSPSCలో నియమించారని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ఆరోపించారు. TSPSCలో స్థానం కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నారని.. అందులో తెలంగాణ వారు కనిపించలేదా అని ప్రశ్నిస్తున్నారు. అటు ఏపీలోనూ తెలంగాణకు చెందిన చాలా మంది ప్రముఖులు, వ్యక్తులు సలహాదారులుగా, ఛైర్మన్లుగా కీలక పదవుల్లో ఉన్నారు.

First Published:  28 Jan 2024 2:43 PM IST
Next Story