Telugu Global
Telangana

మ్యాన్‌హోల్ మూతలు తెరిస్తే క్రిమినల్ కేసులు.. ప్రగతినగర్ ఘటన నేపథ్యంలో కీలక నిర్ణయం

నిబంధనలకు విరుద్దంగా మ్యాన్‌హోల్ కవర్లు తీస్తే ఇంతకు ముందు జరిమానాలు విధించేవారు. కాని ఇకపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు.

మ్యాన్‌హోల్ మూతలు తెరిస్తే క్రిమినల్ కేసులు.. ప్రగతినగర్ ఘటన నేపథ్యంలో కీలక నిర్ణయం
X

వర్షాలు పడినప్పుడు వరద నీరు వేగంగా వెళ్లిపోవాలనే ఉద్దేశంతో చాలా మంది మ్యాన్‌హోల్ మూతలను తెరుస్తున్నారు. వాన నీరు నెమ్మదిగా వెళ్లే వీలున్నా.. త్వరగా నాలాల్లోకి పంపించాలనే ఉద్దేశంతో సొంతగా మ్యాన్‌హోల్ మూతలు తీసేస్తున్నారు. దీంతో అమాయకులు బలైపోతున్నారు. ఇటీవల హైదరాబాద్ ప్రగతినగర్‌లో నిబంధనలకు విరుద్దంగా ఒక అపార్ట్‌మెంట్ ముందు నాలాపై మ్యాన్‌హోల్ కవర్‌ను తెరిచారు. ఆ మ్యాన్‌హోల్‌లో నాలుగేళ్ల మిథున్ రెడ్డి అనే చిన్నారి పడి చనిపోయాడు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ప్రభుత్వ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

నిబంధనలకు విరుద్దంగా మ్యాన్‌హోల్ కవర్లు తీస్తే ఇంతకు ముందు జరిమానాలు విధించేవారు. కాని ఇకపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డు యాక్ట్ 1989 సెక్షన్ 74 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు శనివారం ప్రకటించారు. ఏ వ్యక్తి అయినా కావాలని కానీ, నిర్లక్ష్యంగా గానీ మ్యాన్ హోల్ మూతలను విరగొట్టినా, పాడు చేసినా, తిప్పి పెట్టినా, ఓపెన్ చేసినా, తాళాలు వేసినా, అందులోకి పైపులు జొప్పించినా, ఏ రకంగా అయినా మ్యాన్‌హోల్‌లో మార్పులు చేసినా, హెచ్ఎండబ్యూఎస్ఎస్‌బీకి చెందిన ఏ రకమైన ఆస్తిని నాశనం చేసినా ఈ యాక్ట్ ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ప్రగతి నగర్‌లో జరిగిన ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన సీవరేజ్ బోర్డు అధికారులు.. ఒక వ్యక్తి మ్యాన్‌హోల్ పైన ఉన్న సిమెంట్ మూతను తీసి పక్కన పెట్టినట్లు గుర్తించారు. ఇదే బాలుడి మృతికి కారణమైందని అధికారులు చెబుతున్నారు. అందుకే ఈ కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వర్గాలు చెప్పాయి.

మ్యాన్‌హోల్ కవర్లను అనధికారికంగా ఓపెన్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోజ్ కూడా హెచ్చరించారు. గత వారంలో రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో హైదరాబాద్ నగరంలో మురుగునీటి వ్యవస్థ బలహీనంగా మారిందని. ఇది పలు ప్రాంతాల్లో నీటి నిల్వకు కారణం అవుతుందని ఆయన చెప్పారు. వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత నాలాల్లోని చెత్తను క్లీన్ చేస్తామని ఆయన చెప్పారు. ఈ క్రమంలో ఎవరూ సొంతగా మ్యాన్‌హోల్ మూతలు తీయవద్దని కోరారు. జీహెచ్ఎసీ సిబ్బంది ఎవరైనా మ్యాన్‌హోల్ మూతలు తీస్తే.. వాటిని మూసేసే వరకు అక్కడి నుంచి వెళ్లవద్దని చెప్పారు.

నగరంలో ఎక్కడైనా మ్యాన్‌హోల్స్‌కు మూతలు లేకపోయినా, తీసిన మూతలు పెట్టకపోయినా వెంటనే హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ కస్టమర్ కేర్ నంబర్ 155313కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. ఇప్పటికే 22,000 మ్యాన్‌హోల్స్‌పై సేఫ్టీ గ్రీల్స్ ఏర్పాటు చేశామని.. వాటిని ఎవరూ పక్కకు జరపవద్దని సీవరేజ్ బోర్డు అధికారులు సూచిస్తున్నారు.

First Published:  10 Sept 2023 8:06 AM IST
Next Story