Telugu Global
Telangana

తెలంగాణలో అలర్ట్.. తగ్గిన నేరాలు

తెలంగాణలో ఎన్నికలు జరిగే నవంబర్-30తోపాటు పోలింగ్ ముందు రెండు రోజులు కూడా డ్రై డేస్ గా ఉంటాయని తెలిపారు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్. ఆ మూడు రోజులు మద్యం అమ్మకాలు జరగకూడదని రాష్ట్ర అధికారులను ఆదేశించారు.

తెలంగాణలో అలర్ట్.. తగ్గిన నేరాలు
X

తెలంగాణలో నేడు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతోంది. అయితే షెడ్యూల్ ప్రకటన తర్వాత నుంచి రాష్ట్రంలో పోలీస్ పహారా ఎక్కువైంది. తనిఖీలు ముమ్మరం అయ్యాయి. పోలీస్ తనిఖీలు, పహారా.. అన్నీ ఎన్నికలకోసమే అయినా ఈ క్రమంలో సాధారణ నేరాలు కూడా తగ్గుముఖం పట్టడం విశేషం. ఈ విషయాన్ని రాష్ట్ర డీజీపీయే స్వయంగా వివరించారు. శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉన్నాయని, సాధారణ నేర కార్యకలాపాలు కూడా తగ్గాయని చెప్పారు డీజీపీ అంజనీ కుమార్.

డ్రై డేస్..

తెలంగాణలో ఎన్నికలు జరిగే నవంబర్-30తోపాటు పోలింగ్ ముందు రెండు రోజులు కూడా డ్రై డేస్ గా ఉంటాయని తెలిపారు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్. ఆ మూడు రోజులు మద్యం అమ్మకాలు జరగకూడదని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. ఈమేరకు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలిచ్చారు. ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలతోపాటు వారి సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన రాష్ట్రంలో పరిస్థితులను ఆరా తీశారు. శాంతి భద్రతల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ అభ్యర్థిపై జరిగిన దాడి విషయాన్ని కూడా రాజీవ్ కుమార్ ఆరా తీశారు.

సరిహద్దులు మూత..

తెలంగాణ ఎన్నికల పోలింగ్‌ జరిగే నవంబర్‌ 30వ తేదీకి ముందే రాష్ట్ర సరిహద్దులను మూసివేసి బయటి రాష్ట్రాల నుంచి వ్యక్తులు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు రాజీవ్ కుమార్. ఇతర ప్రాంతాలనుంచి వచ్చి పైరవీలు చేసేందుకు, ఓటర్లను మభ్యపెట్టేందుకు అవకాశం లేకుండా చేయాలన్నారు. ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించాలని సూచించారు.

First Published:  3 Nov 2023 7:34 AM IST
Next Story