క్రికెట్ కామెంట్రీ, సినిమా సెటైర్లు.. కేటీఆర్ ప్రసంగాల్లో కొత్త ట్రెండ్
ఇండియా మూడోసారి క్రికెట్ ప్రపంచకప్ నెగ్గడం ఖాయమని కేటీఆర్ చెప్పారు. ఆ వెంటనే బీఆర్ఎస్ మూడోసారి గెలిచి కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించడంతో ఆ కామెంట్ బాగా వైరలయింది.
మంత్రి కేటీఆర్.. తండ్రిలాగే రాజకీయాల్లోనూ కాదు.. మాటల తూటాలు పేల్చడంలోనూ రాటుదేలుతున్నారు. తెలుగు, ఉర్దూ మాటలతో కేసీఆర్ జనాన్ని మెస్మరైజ్ చేయడం కేసీఆర్ స్టైల్ అయితే.. క్రికెట్ భాషలో, సినిమా స్టైల్లో పంచులు పేల్చడంలో కేటీఆర్ సత్తా చాటుతున్నారు. చదువుకున్న యువతను ఆకట్టుకునేలా ఓ సీఈఓలా, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ స్పీకర్‌లా మాట్లాడే కేటీఆర్ మాస్ పల్స్ పట్టుకోవడానికి క్రికెట్, సినిమా భాషను తెగ వాడేస్తున్నారు.
టీమిండియా మూడోసారి.. బీఆర్ఎస్సూ మూడోసారి
మొన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండియా మూడోసారి క్రికెట్ ప్రపంచకప్ నెగ్గడం ఖాయమని కేటీఆర్ చెప్పారు. ఆ వెంటనే బీఆర్ఎస్ మూడోసారి గెలిచి కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించడంతో ఆ కామెంట్ బాగా వైరలయింది. నిన్న వేములవాడ, ఎల్లారెడ్డిపేట సభల్లో మాట్లాడుతూ టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీలా బీఆర్ఎస్ కూడా రాష్ట్రంలో వంద సీట్లు గెలిచి, సెంచరీ కొడుతుందని కేటీఆర్ అనగానే చప్పట్లు మోత మోగాయి. సమయస్ఫూర్తితో ఆయన వేసే పంచులు జనంలో బాగా పేలుతున్నాయి.
కేసీఆర్ సినిమా సూపర్ హిట్
తెలంగాణ స్టోరీకి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం కేసీఆరే అంటూ కేటీఆర్ ఇదే సభల్లో సినిమా డైలాగ్‌లు పేల్చారు. కాంగ్రెస్ సినిమాకు ప్రొడ్యూసర్ కన్నడవారయితే డైరెక్టర్ ఢిల్లీ వారంటూ కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో కర్ణాటక నుంచి డబ్బు సంచులొస్తున్నాయని, అభ్యర్థుల జాబితా ఢిల్లీ నుంచి వస్తుందన్న బీఆర్ఎస్ వాదనను వినిపించేలా ఈ సెటైర్ వేశారు. ఇక బీజేపీ సినిమాకు గుజరాత్ ప్రొడ్యూసర్ (అమిత్‌షా, మోడీ) అని.. చివరికి వాళ్ల సినిమా డిజాస్టర్ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. చివరకు మన కేసీఆర్ సినిమాయే సూపర్ హిట్ అవుతుందని చెప్పి వచ్చిన జనంతో చప్పట్లు కొట్టించారు.