ఇంతకు మించి కిందకు దిగలేం.. కాంగ్రెస్‌కు తేల్చిచెప్పిన సీపీఎం
ఇప్పటికే 14 స్థానాల్లో అభ్యర్థులను కూడా ప్రకటించింది. మరో 20 స్థానాల్లోనూ పోటీకి సిద్ధమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభ్రదం చెప్పారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పొత్తు కోసం తాము ముందుకొచ్చినా కాంగ్రెస్ తమను పట్టించుకోలేదని, ఎక్కడా మర్యాద పాటించలేదని సీపీఎం గుర్రుగా ఉంది. సొంతంగా పోటీ చేస్తామని తేల్చిచెప్పి, ఇప్పటికే 14 స్థానాల్లో అభ్యర్థులను కూడా ప్రకటించింది. మరో 20 స్థానాల్లోనూ పోటీకి సిద్ధమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభ్రదం చెప్పారు. బీఆర్ఎస్ లైట్ తీసుకుంది కాబట్టి వామపక్షాలకు తాము తప్ప దిక్కు లేదనుకున్న కాంగ్రెస్ పార్టీకి సీపీఎం వరుస ప్రకటనలతో గుబులు మొదలైంది.
హుజూర్‌నగర్, నల్లొండల్లో అభ్యర్థులు ఖరారు
హుజూర్‌నగర్‌లో మల్లు లక్ష్మి, నల్గొండలో ముదిరెడ్డి సుధాకరరెడ్డిలను బరిలో నిలపబోతున్నామని తమ్మినేని ప్రకటించారు. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో అభ్యర్థులను నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. మునుగోడులో సీపీఐ పోటీ చేయకపోతే అభ్యర్థిని పెడతామనీ హింట్ ఇచ్చారు.
కాంగ్రెస్ చర్చిస్తోంది.. కానీ ఇంతకంటే దిగలేం
పొత్తు కావాలంటే మాకు 5 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్‌ను అడిగామని తమ్మినేని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇంకా చర్చిస్తూనే ఉందని, అయితే తాము 5 అడిగి.. 2 స్థానాలకు దిగామని, అంతకంటే దిగలేమని తనకు ఫోన్ చేసిన టీపీసీసీ అగ్రనేత మల్లు భట్టి విక్రమార్కకు తేల్చిచెప్పేశారు. 17 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించి, ఇప్పటికే 14 చోట్ల అభ్యర్థులను ప్రకటించామని.. వారు పోటీ పోటీలో ఉంటారని స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అయోమయంలో పడింది.