వైరా కోసం సీపీఎం పట్టు.. పొత్తు ఉండేనా.. ఊడేనా.?
సీపీఎంకు మిర్యాలగూడ స్థానం ఒకే కాగా.. రెండో సీటుగా ఖమ్మం, పాలేరు, భద్రాచలం, వైరా నాలుగింటిలో ఏదైనా ఒకటి ఇవ్వాలని పట్టుబట్టింది.
కాంగ్రెస్‌తో లెఫ్ట్ పార్టీల పొత్తు ఎటూ తేలడం లేదు. ప్రధానంగా సీపీఎంకు సీట్ల కేటాయింపు విషయంలో వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సీపీఎం అక్టోబర్ 31 వరకు డెడ్‌లైన్ పెట్టింది. దీంతో పొత్తుపై సందిగ్ధత నెలకొంది. సీపీఎం మిర్యాలగూడతో పాటు వైరా స్థానాలు ఇవ్వాలని పట్టుబడుతోంది. అయితే వైరాను సీపీఎంకు ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగా లేదు. ఇక కొత్తగూడెం, చెన్నూరు స్థానాలను తీసుకునేందుకు సీపీఐ అంగీకరించింది.
అయితే సీపీఎంకు మిర్యాలగూడ స్థానం ఒకే కాగా.. రెండో సీటుగా ఖమ్మం, పాలేరు, భద్రాచలం, వైరా నాలుగింటిలో ఏదైనా ఒకటి ఇవ్వాలని పట్టుబట్టింది. సీపీఎం అభ్యర్థనను తోసిపుచ్చిన కాంగ్రెస్ అధిష్టానం.. పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పోటీలో ఉంచింది. ఖమ్మం నుంచి తుమ్మల, భద్రాచలం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు అవకాశం కల్పించింది. దీంతో సీపీఎం వైరా స్థానం కోసం పట్టుబడుతోంది. అయితే కాంగ్రెస్‌లో వైరా స్థానంలో పెద్ద ఎత్తున ఆశావహులు ఉండటంతో ఆ సీటును ఇచ్చేందుకు సుముఖంగా లేదని సమాచారం. దానికి బదులుగా GHMC పరిధిలో ఓ సీటును ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. GHMC పరిధిలో సీటును సీపీఎం తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కాంగ్రెస్‌కు డెడ్‌లైన్ పెట్టారు. వైరా స్థానం కేటాయించకుంటే పొత్తు ఉండదని తేల్చేశారు. సీపీఎంకు ఇచ్చిన స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ రెబల్స్‌ను బరిలో దింపుతోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సమాధానం కోసం అక్టోబర్ 31 వరకు వేచి చూస్తామని.. ఎలాంటి పురోగతి లేకుంటే కూటమికి గుడ్‌బై చెప్పేస్తామన్నారు. ఒంటరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించారు.
అయితే సీపీఎం తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం సీపీఎం నేతలు మొండికిపోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ 3, సీపీఎం 26 స్థానాల్లో పోటీ చేసి ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో సర్దుకుపోవాలని.. అధికారంలోకి వస్తే ప్రత్యామ్నాయంగా అవకాశాలుంటాయని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. మొండికి పోతే పూర్తిగా నష్టం జరిగే అవకాశం ఉందంటున్నాయి.