Telugu Global
Telangana

ఆ సీటు విషయంలో.. రేవంత్ మాట లెక్కచేయని సీపీఎం

బీజేపీ మతోన్మాద శక్తుల చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలని సీపీఎం పిలుపునిచ్చింది. దేశానికి, తెలంగాణ ప్రజలకు బీజేపీ చేసిన అన్యాయాలను గడపగడపకు తిరిగి వివరించాలని తెలిపింది.

ఆ సీటు విషయంలో.. రేవంత్ మాట లెక్కచేయని సీపీఎం
X

కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చింది సీపీఎం. మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సహా ఆపార్టీ ముఖ్యనాయకులతో సమావేశమై పార్లమెంట్ ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని కోరారు. బీజేపీని ఓడించడానికి ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్‌ను గెలిపించాలని మాట తీసుకున్నారు. సీపీఎం నేతలు ఆ చర్చల్లో సీఎం ప్రతిపాదనకు అంగీకరించారు. కానీ భువనగిరి పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న సీపీఎం అభ్యర్థి జహంగీర్‌కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని పట్టుబట్టారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకోలేదు.

షాకిచ్చిన సీపీఎం..

ఎలాగూ 16 స్థానాల్లో మద్దతిచ్చేందుకు అంగీకరించిన సీపీఎం.. భువనగిరిలోనూ వెనక్కి తగ్గుతుందని కాంగ్రెస్‌ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి భావించారు. కానీ సీపీఎం షాకిచ్చింది. భువనగిరి అభ్యర్థిని ఉపసంహరించుకోవాలన్న సీఎం రేవంత్ రెడ్డి కోరికను తోసిపుచ్చింది. మిగిలిన 16 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతిస్తాం. కానీ భువనగిరిలో కొనసాగుతామని ప్రకటించింది.

బీజేపీని గద్దె దించాలి..

బీజేపీ మతోన్మాద శక్తుల చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలని సీపీఎం పిలుపునిచ్చింది. దేశానికి, తెలంగాణ ప్రజలకు బీజేపీ చేసిన అన్యాయాలను గడపగడపకు తిరిగి వివరించాలని తెలిపింది. మతోన్మాద బీజేపీని ఓడించేందుకు ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను భువనగిరి మినహా మిగతా 16 స్థానాల్లో బలపర్చాలని ప్రజలను కోరింది.

First Published:  29 April 2024 3:10 PM IST
Next Story