Telugu Global
Telangana

సీపీఎం పోటీతో నష్టం కాంగ్రెస్‌కే..!

సీపీఎం పోటీ చేస్తున్న 19 స్థానాల్లో ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోనే ఎక్కువ సీట్లు ఉన్నాయి. సీపీఎం కారణంగా ఈ జిల్లాల్లో లేదా ఈ స్థానాల్లో తమకు ఏమైనా నష్టం జరుగుతుందా అనే ఆందోళన కాంగ్రెస్‌ వర్గాల్లో ఉంది.

సీపీఎం పోటీతో నష్టం కాంగ్రెస్‌కే..!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరించిన తీరుతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. మరి సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగడం వల్ల ఏ పార్టీకి నష్టం అంటే అది కాంగ్రెస్‌కేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీపీఎం ఒంటరిగా పోటీ చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందని, తద్వారా పోటీ గట్టిగా ఉండే స్థానాల్లో గెలుపు విషయంలో అది ప్రభావం చూపే అవకాశముందని చెబుతున్నారు. ఇక ఆ పార్టీ ఇప్పటివరకు ఏకంగా 19 మంది అభ్యర్థులను ప్రకటించింది.

తొలుత పొత్తులో భాగంగా 2 సీట్లు ఇస్తామన్న కాంగ్రెస్‌ పార్టీ ఆ తర్వాత మిర్యాలగూడ మాత్రమే కేటాయిస్తామని చెప్పడం, ఖమ్మం జిల్లాలోని వైరా స్థానం కూడా తమకు ఇవ్వాలని సీపీఎం పట్టుబట్టడం తెలిసిందే. అందుకు కాంగ్రెస్‌ అంగీకరించకపోవడంతో ఒంటరిగా బరిలోకి దిగేందుకు సిద్ధమైన సీపీఎం తమ అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం, ఆ జాబితాలు ప్రకటించడంలో పూర్తిగా నిమగ్నమైంది. ఇప్పటివరకు 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీపీఎం.. మంగళవారం నాడు మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

సీపీఎం బలమెంత?

సీపీఎం పోటీ చేస్తున్న 19 స్థానాల్లో ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోనే ఎక్కువ సీట్లు ఉన్నాయి. సీపీఎం కారణంగా ఈ జిల్లాల్లో లేదా ఈ స్థానాల్లో తమకు ఏమైనా నష్టం జరుగుతుందా అనే ఆందోళన కాంగ్రెస్‌ వర్గాల్లో ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన ఓట్లను విశ్లేషిస్తే, సీపీఎం కొన్నిచోట్ల కాస్త ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. భద్రాచలం, వైరా, మిర్యాలగూడ లాంటి స్థానాల్లో ఓ మాదిరి సంఖ్యలో ఓట్లు పడే అవకాశం ఉంది. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేయగా, సీపీఎం ఒంటరిగా రాష్ట్ర వ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి మొత్తం 91,099 ఓట్లు మాత్రమే పొంది ఒక్క సీటూ గెలవలేదు. సీపీఐ పొత్తులో భాగంగా 3 స్థానాల్లో పోటీ చేసి 83,215 ఓట్లు సాధించినా ఎక్కడా గెలవలేదు. సీపీఎంకి ఆ ఎన్నికల్లో అధికంగా భద్రాచలంలో 14,228, వైరాలో 11,373, మిర్యాలగూడలో 11,221, ఇబ్రహీంపట్నంలో 9,106, పాలేరులో 6,769 ఓట్లు వచ్చాయి. అత్యంత తక్కువగా హైదరాబాదులోని నాంపల్లిలో 400 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తంగా చూస్తే 0.44 శాతం మాత్రమే ఓటింగ్‌ నమోదవడం గమనార్హం. అప్పటికీ ఇప్పటికీ సీపీఎం పెద్దగా పుంజుకున్నదేం లేదని, వాస్తవానికి అప్పటికంటే ఇప్పుడు పార్టీ ఓటు బ్యాంక్‌ ఇంకా తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కాంగ్రెస్‌తో పొత్తుపై తేల్చేసిన తమ్మినేని

కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు ముగిసిన అధ్యాయమని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం విలేకరుల సమావేశంలో స్పష్టం చెప్పారు. సీపీఎం అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ స్పందించి తమ పార్టీ కేంద్ర కమిటీతో మాట్లాడారని, దీనిపై సోమవారం రాత్రి అత్యవసరంగా ఆన్‌లైన్‌లో తమ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశమై చర్చించిందని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రతిపాదనను తిరస్కరించిందని వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ ఒక్క స్థానంలోనూ పోటీకి అవకాశం లేనప్పుడు సీపీఎం పొత్తులకు వెళ్లేది లేదని ఆయన స్పష్టం చేశారు.

First Published:  8 Nov 2023 12:10 PM IST
Next Story