కాంగ్రెస్‌తో CPM బ్రేకప్.. 17 స్థానాల్లో పోటీ.!
మొదట భద్రాచలం ఇస్తామని కాంగ్రెస్ మాట తప్పిందని ఆరోపించారు తమ్మినేని. తర్వాత పాలేరు విషయంలో తామే వెనక్కి తగ్గామన్నారు. ఇక వైరా ఇస్తామని తాము చెప్పలేదంటూ సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క అబద్ధమాడరన్నారు.
కాంగ్రెస్‌తో పొత్తుకు బ్రేకప్ చెప్పింది సీపీఎం. ఈ మేరకు అధికార ప్రకటన చేశారు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. కాంగ్రెస్ వైఖరి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తమకు కేటాయిస్తామన్న సీట్లపైనా కూడా కాంగ్రెస్ మాట తప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనివార్య పరిస్థితుల్లోనే ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 20 సీట్లలో పోటీలో ఉంటామని చెప్పారు తమ్మినేని. ప్రస్తుతానికి పోటీ చేసే 17 స్థానాలను ప్రకటించారు. భద్రాచలం, అశ్వారావుపేట, పాలేరు, వైరా, మధిరా, ఖమ్మం, సత్తుపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, నకిరేకల్, భువనగిరి, హుజూర్‌నగర్, కోదాడ, జనగామ, ముషీరాబాద్, ఇబ్రహీంపట్నం, పటాన్‌చెరులో పోటీ చేస్తామన్నారు. రెండు, మూడు రోజుల్లో అభ్యర్థులను ఫైనల్ చేస్తామన్నారు తమ్మినేని. వీటిలోనూ ఒకటి, రెండు చోట్ల మార్పులు జరిగే అవకాశం ఉందన్నారు.
మొదట భద్రాచలం ఇస్తామని కాంగ్రెస్ మాట తప్పిందని ఆరోపించారు తమ్మినేని. తర్వాత పాలేరు విషయంలో తామే వెనక్కి తగ్గామన్నారు. ఇక వైరా ఇస్తామని తాము చెప్పలేదంటూ సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క అబద్ధమాడరన్నారు. సీపీఐ పోటీ చేసే చోట వారికి మద్దతిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవకూడదన్నదే లెఫ్ట్ పార్టీల ప్రయత్నమన్నారు. బీజేపీకి గెలుపు అవకాశాలున్నచోట తప్పకుండా బరిలో ఉంటామన్నారు. 1996లో ప్రధాని పదవినే వదిలేసిన పార్టీ తమదని.. అలాంటి తమకు ఎమ్మెల్సీలు ఇస్తాం, మంత్రి పదవులు ఇస్తామనడం సరికాదన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లోనే ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించామన్నారు తమ్మినేని.