తెలంగాణ ప్రభుత్వంలో చేరికకు సీపీఐ సుముఖం!
తెలంగాణ ప్రభుత్వంలో చేరిక అంశంపై ఆలోచిస్తున్నట్టు చెప్పారు. ఇంకా తమకు పొత్తులో భాగంగా రెండు ఎమ్మెల్సీ స్థానాలు రావాల్సి ఉందని ఆయన గుర్తుచేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న సీపీఐ.. కొత్తగూడెం స్థానం నుంచి పోటీచేసిన విషయం తెలిసిందే. సీపీఐకి ఒక సీటు కేటాయించిన కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో పొత్తుకు సిద్ధమై బరిలోకి దిగిన సీపీఐ కొత్తగూడెంలో విజయం సాధించింది.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆ పార్టీ తరఫున కొత్తగూడెం నియోజకవర్గంలో పోటీకి దిగగా, కాంగ్రెస్ పార్టీ మద్దతుతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంలో చేరిక అంశంపై ఆలోచిస్తున్నట్టు చెప్పారు. ఇంకా తమకు పొత్తులో భాగంగా రెండు ఎమ్మెల్సీ స్థానాలు రావాల్సి ఉందని ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో చేరికకు సీపీఐ సిద్ధంగా ఉందని అర్థమవుతోంది. సీపీఐ తరఫున గెలుపొందిన కూనంనేని సాంబశివరావు కూడా ఈ సమావేశంలో మాట్లాడారు.