Telugu Global
Telangana

చిల్లర బేరగాడు వ్యాఖ్యలపై దుమారం

చిల్లర బేరగాడు వ్యాఖ్యలపై దుమారం
X

సీపీఐ నారాయణ నటుడు చిరంజీవిపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.అటు నాగబాబు నుంచి.. మెగా అభిమాన సంఘాల వరకు నారాయణపై విరుచుకుపడుతున్నాయి. నారాయణ మాత్రం తన వ్యాఖ్యలపై వెనక్కు తగ్గేది లేదని మరోసారి తేల్చిచెప్పారు.

రాష్ట్రపతి ఎన్నికలు, అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమంపై తొలుత స్పందించిన నారాయణ.. తెలుగు ప్రజలకు అల్లూరి అంటే గుర్తుకు వచ్చేది సూపర్ స్టార్ కృష్ణ అని.. అలా అల్లూరి పాత్ర పోషించి మెప్పించిన కృష్ణను కాకుండా చిల్లర బేరగాడు, బ్రోకర్‌ చిరంజీవిని స్టేజ్‌ మీదకు తీసుకొచ్చారని.. అక్కడే అల్లూరి స్పూర్తిని దెబ్బతీశారని విమర్శించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని పవన్ చెప్పడం మంచిదేనని.. కానీ అతడో ల్యాండ్ మైన్‌ లాంటి వాడని.. ఎప్పుడు ఎక్కడ, ఎవరి మీద పేలుతాడో తెలియదంటూ నారాయణ ఎద్దేవా చేశారు. బెంగాల్ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టిన దుర్మార్గుడిని ఉప రాష్ట్రపతిగా తెస్తున్నారని కూడా నారాయణ విమర్శలు చేశారు.

చిరంజీవిని చిల్లర బేరగాడు అనడంతో అటు నుంచి అంతే స్థాయిలో రియాక్షన్ వచ్చింది. చిరంజీవి అభిమానులు నారాయణ దిష్టిబొమ్మలను దహనం చేశారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చిరంజీవి తమ్ముడు నాగబాబు ట్విట్టర్లో స్పందించారు.

'' ఇటీవల కాలంలో మెగా అభిమానులు మరియు జనసైనికులు కొంత మంది చేసిన తెలివితక్కువ వెర్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ మన కుర్రాళ్ళకి నేను చెప్పదలుచుకొందేంటంటే ఈ సిపిఐ నారాయణ అనే వ్యక్తి చాలా కాలం నుండి అన్నం తినడం మానేసి కేవలం ఎండు గడ్డి మరియు చెత్తా చెదారం తింటున్నాడు. కాబట్టి మన మెగా అభిమానులందరికీ నా హృదయపూర్వక విన్నపం ఏమిటనగా.. దయచేసి వెళ్లి అతనితో గడ్డి తినడం మాన్పించి.. కాస్త అన్నం పెట్టండి..! తద్వారా అతను మళ్లీ తెలివి తెచ్చుకుని మనిషిలా ప్రవర్తిస్తాడు.'' అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.

ఇలా చిరంజీవి కుటుంబం, అభిమానుల నుంచి తనపై ఎదురు దాడి జరగడాన్ని నారాయణ మాత్రం లైట్ తీసుకున్నారు. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదన్నారు. పనిలో పనిగా మరోసారి చిరంజీవిపై మరికొన్ని విమర్శలు చేశారు. అల్లూరి సీతారామరాజు అంటేనే కృష్ణ గుర్తుకు వస్తారని.. అలాంటి వ్యక్తిని పిలవకుండా చిరంజీవిని ఎందుకు పిలిచారన్నదే తన ప్రశ్న అన్నారు. వాస్తవాలు చెబితే ఉలిక్కిపడితే ఎలా అని ప్రశ్నించారు. చిరంజీవి ఇటీవల తప్పులు చేస్తున్నారన్నది నిజమని.. చిత్ర పరిశ్రమ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో చిరంజీవి జగన్‌ను కలిసి సొంత పనులు చేయించుకున్నారని నారాయణ తాజాగా మరో ఆరోపణ చేశారు. కుమారుడు నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కోసం సీఎంను కాకపట్టి కళాకారులకు అన్యాయం చేశారని ఆరోపించారు. కృష్ణను పిలవాల్సిందిగా చిరంజీవి అయినా చెప్పవచ్చు కదా అని నారాయణ ప్రశ్నించారు.

First Published:  20 July 2022 7:51 AM IST
Next Story