Telugu Global
Telangana

సాయుధ పోరాట ఉత్సవాలు చేసే హక్కు బీజేపీకి ఎక్కడిది : నారాయణ

స్వాతంత్ర పోరాటంలోనే కాదు.. అసలు ఏ ఉద్యమంలో కూడా బీజేపీ పాత్ర లేదని.. ఆ పార్టీకి సాయుధ పోరాట ఉత్సవాలు చేసే హక్కు లేదని ఆయన తేల్చి చెప్పేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.

సాయుధ పోరాట ఉత్సవాలు చేసే హక్కు బీజేపీకి ఎక్కడిది : నారాయణ
X

స్వాతంత్రోద్యమంలో బీజేపీ ఎక్కడ ఉంది? తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర ఏముందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. స్వాతంత్ర పోరాటంలోనే కాదు.. అసలు ఏ ఉద్యమంలో కూడా బీజేపీ పాత్ర లేదని.. ఆ పార్టీకి సాయుధ పోరాట ఉత్సవాలు చేసే హక్కు లేదని ఆయన తేల్చి చెప్పేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం గురించి ఒక్కో పార్టీ తమదైన రీతిలో ఒక్కోలా భాష్యం చెప్పుకుంటున్నాయి. అసలు తెలంగాణ సాయుధ పోరాటం కమ్యూనిస్టుల వారసత్వ హక్కు అని స్పష్టం చేశారు. దాని గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి కూడా లేదని ఆయన పునరుద్ఘాటించారు.

కొన్ని పార్టీలు చాకలి ఐలమ్మ లాంటి పోరాట యోధులను తమ స్వార్థం కోసం హైజాక్ చేస్తున్నాయ‌ని నారాయణ మండిపడ్డారు. ఇప్పుడు విమోచన, విలీనం అని మాట్లాడుతున్న పార్టీలు ఏవీ కూడా తెలంగాణ సాయుధ పోరాట సమయంలో లేవని, ఆ ఉద్యమంలో పాల్గొనలేదని అన్నారు. అలాంటి పార్టీలకు సాయుధ పోరాట వారోత్సవాలు చేసే హక్కు ఉందా అని ప్రశ్నించారు. సెప్టెంబర్ 17 చరిత్ర గురించి బీజేపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అది వారి సొంతం అనేలా వారి వ్యాఖ్యలు ఉన్నాయి. తెలంగాణ విమోచన దినం అంటూ ఏనాడు లేదు. కానీ బీజేపీ కావాలనే సికింద్రాబాద్‌లో సభ పెట్టి అమరవీరులను స్మరించిందని చెప్పుకొచ్చారు.

నారాయణ వ్యాఖ్యలు పూర్తిగా హోం మంత్రి అమిత్ షా ప్రసంగం టార్గెట్‌గానే సాగింది. తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడం తమ ఘనతే అని ఆయన చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లూ విమోచన దినం చేయడానికి ప్రతీ పార్టీ భయపడిందని అన్నారు. ఈ విషయాలపైనే నారాయణ ఫైర్ అయ్యారు. అసలు నిన్న మొన్న పుట్టిన బీజేపీ.. ఎలాంటి ఉద్యమ చరిత్ర లేని బీజేపీ ఇలా కమ్యూనిస్టు పార్టీ నేతలను ఓన్ చేసుకునేలా మాట్లాడటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చరిత్రను వక్రీకరించేలా బీజేపీ నేతల మాటలు ఉన్నాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

First Published:  17 Sept 2022 7:54 PM IST
Next Story