క్రిమినల్ షా దగ్గరకి ఎన్టీఆర్ వెళ్లాలా?.. అదానీ స్మగ్లర్ అంటూ సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ బీజేపికి వ్యతిరేకంగా మారారు కాబట్టే కేంద్ర సంస్థలు ఆయన్ని టార్గెట్ చేశాయని ఆరోపించారు. ఆప్ నాయకుల విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు కొండను తవ్వి ఎలుకని పట్టుకున్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు.
సీపీఐ నారాయణ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో కలకలం రేపారు. కేసీఆర్ బీహార్ సీఎం నితీష్ కుమార్‌ని కలిసిన సందర్భంగా హైదరాబాద్‌లో నారాయణ మీడియాతో మాట్లాడారు. బీజేపీ వ్యతిరేక కూటమిని కలిసినందుకు కేసీఆర్ ని అభినందించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న అన్ని శక్తులని కేసీఆర్ కలవాలని సూచించారు. బీజేపికి వ్యతిరేకంగా పోరాడటానికి జగన్‌ని కూడా కేసీఆర్ ఒప్పించాలన్నారు.
కేసీఆర్ బీజేపికి వ్యతిరేకంగా మారారు కాబట్టే కేంద్ర సంస్థలు ఆయన్ని టార్గెట్ చేశాయని ఆరోపించారు. ఆప్ నాయకుల విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు కొండను తవ్వి ఎలుకని పట్టుకున్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీ దక్షిణాదిలో బలపడటానికి సినిమా యాక్టర్ల కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తోందని, జూనియర్ ఎన్టీఆర్ తాత, తండ్రి మంచివారని, క్రిమినల్ అయిన అమిత్ షా దగ్గరికి తారక్ ఎందుకెళ్లాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదానీ ఒక స్మగ్లర్ అని, అటువంటి అదానీ ఇంత ధనవంతుడు ఎలా అయ్యాడని ప్రశ్నించారు. మన దేశాన్ని గుజరాత్ వాళ్లు దోచేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.