కాంగ్రెస్‌కు సీపీఐ ఓకే.. సీపీఎంతోనే కష్టం.. ఎందుకో తెలుసా?
సీపీఐ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో సీపీఐ నారాయణ భేటీ అయ్యారు.
రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవడం లేదని తేల్చి చెప్పేసింది. సీఎం కేసీఆర్ స్వయంగా తమ మిత్ర పక్షం కేవలం ఎంఐఎం మాత్రమే అని టికెట్లు ప్రకటించిన రోజు స్పష్టం చేశారు. కమ్యూనిస్టులతో పొత్తున్న మునుగోడు ఉపఎన్నికతోనే సరిపెట్టారు. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న వామపక్షాలు.. ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుకుతున్నాయి. సీపీఐ, సీపీఎం పార్టీలు కలిసి 10 స్థానాల్లో పోటీ చేయాలని భావించాయి. బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉన్నా ఆ 10 స్థానాలు కోరాలని అనుకున్నాయి. కానీ ఇప్పుడు అధికార బీఆర్ఎస్‌తో పొత్తు లేదు. దీంతో వామపక్షాలు ఒంటరిగానే పోటీ చేస్తాయని ఇటీవల జరిగిన ఒక సమావేశం అనంతరం ప్రకటించాయి.
అయితే సీపీఐ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో సీపీఐ నారాయణ భేటీ అయ్యారు. పొత్తు, సీట్ల పంపిణీపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తున్నది. నారాయణ కూడా చర్చలు సఫలం అయ్యాయని.. కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు. సీపీఎం మాత్రం ఇంకా ఎలాంటి చర్చలు జరపలేదు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం మాత్రం సీపీఎం నాయకులతో మాట్లాడాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఉభయ కమ్యూనిస్టులు పొత్తుకు ఓకే చెప్తే చెరో ఒకటి లేదా రెండు సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
కాగా, కాంగ్రెస్ ఇచ్చే ఒకటి లేదా రెండు సీట్లు తీసుకోవడానికి సీపీఐ పార్టీ ఓకే చెప్పవచ్చని తెలుస్తున్నది. కానీ కాంగ్రెస్ పార్టీకి సీపీఎం డిమాండ్లతోనే కష్టంగా ఉన్నది. సీపీఐ పార్టీ తమకు కొత్తగూడెం, హుస్నాబాద్, మునుగోడు, బెల్లంపల్లి సీట్లు కావాలని కోరే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి, హుస్నాబాద్ సీట్లు ఇవ్వడానికి పెద్దగా అభ్యంతరం పెట్టకపోవచ్చని తెలుస్తున్నది. ఇక సీపీఎం మధిర, పాలేరు, ఇబ్రహీంపట్నం, మిర్యాలగూడ, భద్రాచలం సీట్లు ఇస్తే పొత్తుకు రెడీగా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ సీపీఎం అడిగే ఆ ఐదు సీట్లలో ఏ ఒక్కటి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అన్ని చోట్లా బలమైన అభ్యర్థులు కాంగ్రెస్‌కు ఉండటంతో.. సీపీఎంతో పొత్తు విషయంలో ఆలోచిస్తున్నది.
అయితే సీపీఎంను వదిలేసి సీపీఎంతో కాంగ్రెస్ పొత్తుకు రెడీ అయినా.. ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపే అవకాశం ఉండదు. సీపీఐ, సీపీఎం పార్టీలు కలిసి వస్తేనే కాంగ్రెస్‌కు లాభం చేకూరుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉభయ కమ్యూనిస్టులు కలవడం ద్వారా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కాంగ్రెస్‌కు భారీ లాభమే ఉంటుందని భావిస్తున్నారు. అయితే, ఈ రెండు జిల్లాల్లో కాంగ్రెస్ నాయకులకు సీట్లు సర్థుబాటు చేయడమే కష్టంగా మారింది. ఇప్పుడు వాటిలో నుంచి కమ్యూనిస్టులకు తీసి ఎలా ఇవ్వాలో కాంగ్రెస్ పార్టీకి అర్థం కావడం లేదు. సీపీఐను ఎలాగోలా బుజ్జగించినా.. సీపీఎం మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టికెట్లు కోరుతోంది. తాము ఆ జిల్లాలోనే ఎక్కువ బలంగా ఉన్నామని.. అందుకే అక్కడ సీట్లు కోరుతున్నామని చెబుతోంది.
దీంతో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోలేక, వదులుకోలేక సతమతం అవుతోంది. సీపీఎం రాష్ట్ర నాయకులతో కాంగ్రెస్ జాతీయ నాయకులు త్వరలోనే మాట్లాడతారని తెలుస్తున్నది. ఆ చర్చల తర్వాత సీపీఎం పొత్తు కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాతే కాంగ్రెస్ పార్టీ అధికారికంగా వామపక్షాల పొత్తును ప్రకటిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.