Telugu Global
Telangana

కామ్రేడ్లకు కష్టకాలం.. కాంగ్రెస్ తో కుదరని బేరం

మధ్యే మార్గంగా కొన్ని స్థానాలు వదులుకొని, మరికొన్ని స్థానాలు ఇష్టం లేకపోయినా తీసుకోడానికి వామపక్షాలు ముందుకొస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఈలోగా కాంగ్రెస్ లిస్ట్ ప్రకటిస్తే కథ మళ్లీ మొదటికొస్తుంది.

కామ్రేడ్లకు కష్టకాలం.. కాంగ్రెస్ తో కుదరని బేరం
X

తెలంగాణలో కామ్రేడ్లకు ఇది కష్టకాలమేనని చెప్పాలి. బీఆర్ఎస్ తో పొత్తు క్యాన్సిల్ కావడంతో కనీసం కాంగ్రెస్ అయినా ఆదరిస్తుందని ఆశించారు నేతలు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కూడా సీపీఐ, సీపీఎం విన్నపాలు మన్నించేలా లేదు. దీంతో పొత్తుపై ఇంకా మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు నేతలు. తాము అడిగినన్ని సీట్లు, అడిగిన చోట కాంగ్రెస్ ఇవ్వకపోతే సీపీఐ, సీపీఎం మాత్రమే కలసి పోటీ చేయాలని అనుకుంటున్నాయి.

వామపక్షాల డిమాండ్లు ఏంటి..?

సీపీఐ, సీపీఎం.. తెలంగాణలో మొత్తం 11 స్థానాలు కావాలంటున్నాయి. కానీ బీఆర్ఎస్ ఒకటీ రెండు అని తేల్చి చెప్పింది. అందులోనూ ఇండియా కూటమిలో ఉండాలనుకుంటున్న వామపక్షాలకు, ఎన్డీఏ, ఇండియా కూటములకు సమాన దూరంలో ఉన్న బీఆర్ఎస్ కి పొత్తు పొసగలేదు. దీంతో వామపక్షాలు కాంగ్రెస్ వైపు దృష్టిసారించాయి. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉన్నాం కదా, తెలంగాణలో కూడా కనికరించండి అంటూ 11 సీట్ల ప్రతిపాదనలు ముందు పెట్టారు నేతలు. కానీ కాంగ్రెస్ లోనే ఆ 11లో కొన్నింటికి విపరీతమైన కాంపిటీషన్ ఉంది.

సీపీఐ ఆశిస్తున్న సీట్లు..

హుస్నాబాద్

కొత్తగూడెం

మునుగోడు

బెల్లంపల్లి

దేవరకొండ

సీపీఎం కావాలంటున్నవి..

భద్రాచలం

పాలేరు

మిర్యాలగూడ

మధిర

ఖమ్మం

ఇబ్రహీంపట్నం

కాంగ్రెస్ లో ఆయా సీట్ల విషయంలో గట్టి పోటీ ఉంది. హుస్నాబాద్ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ బరిలో దిగాలనుకుంటున్నారు. పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఖమ్మం నుంచి తుమ్మల, ఇబ్రహీంపట్నం నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, మధిర నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పోటీకి ఉన్నారు. అంటే ఆయా సీట్లు వామపక్షాలకు దక్కే ఛాన్స్ లేదు. మధ్యే మార్గంగా కొన్ని స్థానాలు వదులుకొని, మరికొన్ని స్థానాలు ఇష్టం లేకపోయినా తీసుకోడానికి వామపక్షాలు ముందుకొస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఈలోగా కాంగ్రెస్ లిస్ట్ ప్రకటిస్తే కథ మళ్లీ మొదటికొస్తుంది.

First Published:  22 Sept 2023 7:48 AM IST
Next Story