సీపీఐ-కాంగ్రెస్ పొత్తు ఫైనల్.. డీల్ ఇదే.!
సీపీఐ-కాంగ్రెస్ మధ్య సమన్వయం కోసం కమిటీ వేస్తామని ప్రకటించారు రేవంత్ రెడ్డి. పెద్దమనసుతో సహకరించాలని సీపీఐని కోరినట్లు చెప్పారు.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్-సీపీఐ మధ్య ఎట్టకేలకు పొత్తు కుదిరింది. సీపీఐ ఆఫీసుకు వెళ్లిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పొత్తుపై అధికారిక ప్రకటన చేశారు. సీపీఐ కొత్తగూడెం స్థానం నుంచి పోటీ చేస్తుందని ప్రకటించారు. కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి గెలుపు కోసం కృషిచేస్తామని ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఎన్నికల తర్వాత సీపీఐకి రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామని హామీ ఇచ్చారు.
ఇక సీపీఐ-కాంగ్రెస్ మధ్య సమన్వయం కోసం కమిటీ వేస్తామని ప్రకటించారు రేవంత్ రెడ్డి. పెద్దమనసుతో సహకరించాలని సీపీఐని కోరినట్లు చెప్పారు. మొదట్లో లెఫ్ట్ పార్టీలు పది స్థానాలు కోరగా అందుకు కాంగ్రెస్ అంగీకరించలేదు. తర్వాత రెండు స్థానాలు ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇచ్చే రెండు స్థానాల విషయంలో భిన్నాభిప్రాయాలు వచ్చాయి.
కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోవడంతో ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని సీపీఎం ప్రకటించింది. 14 స్థానాలకు అభ్యర్థులను సైతం ప్రకటించింది. మరో 4-5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని స్పష్టం చేసింది. సీపీఐ పోటీ చేసే చోట వారికి మద్దతిస్తామని ఆ పార్టీ నేత తమ్మినేని వీరభద్రం ఇప్పటికే ప్రకటించారు.