మునుగోడులో కండువా రివర్స్! తగ్గిన చేరికల జోరు!
అన్ని పార్టీల నేతలు ఇతర పార్టీల నేతల టచ్‌లోకి వెళ్లారు. దీంతో ఏ నేతను నమ్మాలో.. ఏ కార్యకర్తపై భరోసా పెంచుకోవాలో తెలియక నేతలు తికమకపడుతున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడుతుందనే అంచనాల నేపథ్యంలో ప్రధాన పార్టీలు జోరుపెంచాయి. రాత్రికి రాత్రే నేతలను తమ పార్టీలో చేర్చుకుంటున్నాయి. కొందరు ప్రజాప్రతినిధులు ఇప్పటికే పార్టీ మారారు. తొలిరౌండ్‌లో జోరుగా నేతలు పార్టీలు కండువా మార్చారు. మూడు పార్టీలు నేతలకు గాలం వేయడంతో గ్రామాల్లో చోటామోటా నేతలకు టైమ్ వచ్చింది, కండువా మారిస్తే ఇంత రేటు అంటూ ప్రచారం చేసుకున్నారు. దీంతో ఏ నేత ఎప్పుడూ ఏ పార్టీలో ఉండాడో తెలియని పరిస్థితి నెలకొంది. అన్ని పార్టీల నేతలు ఇతర పార్టీల నేతల టచ్‌లోకి వెళ్లారు. దీంతో ఏ నేతను నమ్మాలో.. ఏ కార్యకర్తపై భరోసా పెంచుకోవాలో తెలియక నేతలు తికమకపడుతున్నారు.
కండువా మార్పిడికి తోడు కోవర్టు రాజకీయాలు పెరిగాయి. మండలాల్లో అమలు చేసే వ్యూహాలు ముందే లీక్ కావడంతో నేతలు జాగ్రత్త పడుతున్నారు, దీంతో క్లోజ్డ్ మీటింగ్‌లకు సెల్‌ఫోన్లు దూరం పెట్టిస్తున్నారు. రాబోయే రోజుల్లో కోవర్టు రాజకీయాలతో నేతలకు తలనొప్పి వచ్చే అవకాశాలే కన్పిస్తున్నాయి. ఇటు గ్రామంలో ఓ వంద ఓట్ల వరకు ప్రభావితం చేస్తాడని నమ్మే నేతలకు గిరాకీ పెరిగింది, బలమైన నేతలను తమ పార్టీలోకి తీసుకురావాలని నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేతలు ఐదు నుంచి పది లక్షలు పలుకుతున్నారు. కానీ వీరితో పాటు వెళ్లే నేతలకు గిట్టుబాటు కావడం లేదు. ఇలాంటి నేతలతో పాటు కింది స్థాయి నేతలు పార్టీ మారడం లేదట. మరోవైపు ఆఫర్‌లకు లొంగి పార్టీ మారిన నేతలు రెండు మూడు రోజులకే కొత్త పార్టీలో పరిస్థితి అర్దమై వెనక్కి వచ్చేస్తున్నారట. ఇతర పార్టీల ఆఫర్‌లకు లొంగి పార్టీ మారే నేతలను లైట్‌గా తీసుకోవాలని కొన్ని పార్టీల్లో ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి.
మరోవైపు ఫస్ట్‌లో నేతలకు భారీ ఆఫర్లు ఇచ్చారు. పది నుంచి 20 లక్షలు ఆఫర్లు చేశారు. తీరా చివరికి చెప్పిన దాంట్లో 20 శాతమే ఇస్తున్నారట. దీంతో కొందరు ప్రజా ప్రతినిధులు తాము ఇంత తీసుకున్నామని ప్రచారం చేసి...ఇప్పుడు దాంట్లో సగం కూడా ఇవ్వలేదని వాపోతున్నారట. మొత్తానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక నేర్పిన పాఠమో తెలియదు. కానీ రాజకీయ పార్టీలు మాత్రం ముందు జాగ్రత్త పడుతున్నాయి. నేతలను కొనడమే కాదు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నిస్తున్నాయి.