Telugu Global
Telangana

స్టాన్‌ఫర్డ్‌లో అడ్మిషన్‌ ఇప్పిస్తామని.. కోట్లు కొట్టేశారు

ఎన్ని రోజులు గడిచినా ఈ ప్రక్రియలో పురోగతి లేకపోవడంతో బాధితుడు సంజీవ్‌కుమార్‌ వారిని నిలదీశాడు. దీంతో అడ్మిషన్‌ గురించి మాట్లాడేందుకు అమెరికా వెళ్తున్నామని చెప్పి వారు మైసూర్‌కి వెళ్లిపోయారు.

స్టాన్‌ఫర్డ్‌లో అడ్మిషన్‌ ఇప్పిస్తామని.. కోట్లు కొట్టేశారు
X

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విద్యాసంస్థగా పేరొందిన అమెరికాలోని స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేయాలని అతను ఆశ పడ్డాడు. అతని ఆశను గుర్తించిన హైదరాబాద్‌కు చెందిన దంపతులు అతనికి అడ్మిషన్‌ ఇప్పిస్తామంటూ నమ్మబలికారు. అమెరికాలోని వైట్‌హౌస్‌లో తమకు తెలిసిన వ్యక్తి ఉన్నారంటూ నమ్మించారు. అడ్మిషన్‌ కోసం అతని నుంచి ఏకంగా రూ.3.25 కోట్లు వసూలు చేశారు. ఆ తర్వాత వారు తనను మోసం చేశారని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుల గుట్టు రట్టయింది.

బాధితుడు చాట్ల సంజీవ్‌కుమార్‌ మాదాపూర్‌ వాసి. హైదరాబాద్‌కు చెందిన పాలడుగు రఘురామ్, సునీత దంపతులు స్టాన్‌ఫర్డ్‌లో సీటు ఇప్పిస్తామంటూ అతన్ని నమ్మించి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశారు. అయితే ఎన్ని రోజులు గడిచినా ఈ ప్రక్రియలో పురోగతి లేకపోవడంతో బాధితుడు సంజీవ్‌కుమార్‌ వారిని నిలదీశాడు. దీంతో అడ్మిషన్‌ గురించి మాట్లాడేందుకు అమెరికా వెళ్తున్నామని చెప్పి వారు మైసూర్‌కి వెళ్లిపోయారు. అమెరికాలో ఉన్నట్టుగా మైసూర్‌ నుంచి వాట్సాప్‌ కాల్‌ మాట్లాడారు. వారు తనను మోసం చేస్తున్నారని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సైబరాబాద్‌ పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

First Published:  28 July 2024 9:39 AM IST
Next Story