Telugu Global
Telangana

దేశానికి ఇప్పుడు తెలంగాణ మోడల్ లాంటి అభివృద్ధి అవసరం : మంత్రి కేటీఆర్

ఉపాధి కల్పన, ఔత్సాహిక పారిశ్రామిక రంగాల్లోని అవకాశాలను అందిపుచ్చుకునేలా యువతను తయారు చేసినప్పుడే మన దేశ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని కేటీఆర్ తెలిపారు.

దేశానికి ఇప్పుడు తెలంగాణ మోడల్ లాంటి అభివృద్ధి అవసరం : మంత్రి కేటీఆర్
X

తెలంగాణ మోడల్‌ను దేశం అనుసరిస్తే ఇండియాకు తిరుగే ఉండదని మంత్రి కేటీఆర్ అన్నారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ యూకేలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా లండన్‌లో జరిగిన 'ఐడియాస్ ఫర్ ఇండియా' సదస్సులో ఆయన పాల్గొని, ప్రసంగించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో ఐదు విప్లవాలను సాధించడంతోనే.. తెలంగాణ రాష్ట్రంలో అనతి కాలంలో ప్రగతి సాధ్యమైందని అన్నారు. తొమ్మిదేళ్ల రాష్ట్ర ప్రస్థానంలో సాధించిన విజయాలను ఆయన వివరించారు.

ఉపాధి కల్పన, ఔత్సాహిక పారిశ్రామిక రంగాల్లోని అవకాశాలను అందిపుచ్చుకునేలా యువతను తయారు చేసినప్పుడే మన దేశ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని కేటీఆర్ తెలిపారు. దేశంలో సమృద్ధిగా సహజ వనరులు, ఖనిజాలతో పాటు తగినంత విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన వనరులు ఉన్నాయి. దేశంలో ఉన్న నదులు, సరస్సుల వల్ల తాగు నీరు, సాగునీరు అందించడంతో పాటు పారిశ్రామిక రంగానికి కూడా అవసరమైనవి సరఫరా చేయవచ్చని.. ఇవన్నీ ఇండియాకు ఉన్న అనుకూలతలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

ఇండియాలో సాటిలేని మానవ వనరులు ఉన్నాయని తెలిపారు. దేశ జనాభాలో 67 శాతం మంది పని చేసే వయసులో ఉన్నవారే అని వెల్లడించారు. అది మన దేశానికి దొరికిన గొప్ప వరంగా కేటీఆర్ అభివర్ణించారు. యువ శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకొని చైనా దేశం 30 ఏళ్లలోనే అద్భుతమైన ప్రగతిని సాధించింది. సరైన ప్రణాళికలు అమలు చేస్తే ఇండియా కేవలం 20 ఏళ్లలో మన పర్ క్యాపిటా ఆదాయాన్ని 6 నుంచి 8 రెట్లు పెంచుకోగలుగుతుందని కేటీఆర్ చెప్పారు.

దేశంలో తెలంగాణ ఒకప్పుడు చాలా వెనుకబడిన ప్రాంతం. దీన్ని ఒక ఎడారిగా భావించేవారు. గ్రామాల్లోని సరస్సులు, బావులు ఎండిపోయేవి. సాగు నీటి కోసం రైతులు అనేక బోర్లు తవ్వినా ఫలితం ఉండేది కాదు. తాగడానికి నీళ్లు లేక, ఫ్లోరోసిస్‌తో బాధపడేవారు. కానీ ఇప్పడు తెలంగాణ పచ్చని రాష్ట్రంగా మారింది. ఏడాదికి రెండు పంటలు పండిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులతోనే రాష్ట్రం ఇలా అభివృద్ధి చెందిందని కేటీఆర్ వివరించారు.

దేశంలో తెలంగాణ జనాభా 2.5 శాతంగా ఉండగా.. జీడీపీ 5 శాతం వాటా కలిగి ఉందన్నారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తొలి స్థానంలో తెలంగాణ ఉందని.. రాష్ట్రం ఏర్పడిన తర్వాతే 2.5 రెట్లు తలసరి ఆదాయం పెరిగిందని అన్నారు. అంతర్జాతీయ టెక్ దిగ్గజ కంపెనీలకు హైదరాబాద్ నిలయంగా మారిందని చెప్పారు. నూతన ఆవిష్కరణలకు కూడా కేంద్రంగా నిలిచిందని పేర్కొన్నారు. విద్యుత్, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, ఆర్థిక రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న విధానాలు, పథకాలను సమావేశానికి వచ్చిన వారికి మంత్రి కేటీఆర్ వివరించారు.


First Published:  14 May 2023 7:18 AM IST
Next Story