Telugu Global
Telangana

అవార్డు ఇస్తామన్న నోటితో తప్పుడు ప్రచారం దేనికి..?

ఒకవేళ ఆ లీకులే నిజమైతే.. ఈ లేఖ అబద్ధం కావాలి. ఈ లేఖే నిజమైతే ఆ లీకులిచ్చినవారు నీచులు అయిఉండాలి.

అవార్డు ఇస్తామన్న నోటితో తప్పుడు ప్రచారం దేనికి..?
X

మిషన్ భగీరథ కార్యక్రమాన్ని అభినందిస్తూ కేంద్ర జల్ జీవన్ మిషన్ ఈనెల 26న తెలంగాణ ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. ఇంటింటికీ కుళాయి కనెక్షన్ల విషయంలో అవార్డుకి ఎంపిక చేశామని అక్టోబర్ 2న ఈ అవార్డు అందుకోవ‌డానికి ఢిల్లీకి రావాల్సిందిగా ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ 4రోజులకి కేంద్రం నాలిక మడతపెట్టింది. తెలంగాణ పథకానికి అవార్డు రావడం ప్రభుత్వ పెద్దల్లో కొందరికి ఇష్టంలేదు. అందుకే వారు మీడియాకి లీకులిచ్చారు. అసలా అవార్డు కేంద్రం ఇవ్వలేదని అబద్ధమాడారు.

సాక్ష్యం ఇదిగో..

కేంద్రం ఏ కేటగిరీకింద, ఎందుకు అవార్డు ఇచ్చిందనే విషయం రాష్ట్రానికి పంపిన లేఖలో ఉందని సాక్ష్యాధారాలను బయటపెట్టారు తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్. జల్ జీవన్ మిషన్ అడిషనల్ సెక్రటరీ వికాస్ షీల్ పేరుతో వచ్చిన లేఖను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇంటింటికీ కుళాయి కనెక్షన్ల విషయంలో అసాధారణ పనితీరుని ప్రోత్సహిస్తూ కేంద్రం తెలంగాణను అవార్డుకి ఎంపిక చేస్తూ రాసిన లెటర్ ని ఆయన బయటపెట్టారు. దీన్నేమంటారని ప్రశ్నించారు.

ఎందుకీ లీకులు..?

ఆమధ్య తెలంగాణకు వచ్చిన కేంద్ర మంత్రులంతా మిషన్ భగీరథను తీవ్రంగా విమర్శించారు. కానీ ఇప్పుడు కేంద్ర జల జీవన్ మిషన్, మిషన్ భగీరథలో భాగంగా ఇచ్చిన ఇంటింటి మంచినీటి కనెక్షన్లను మెచ్చుకుంది. అంటే కేంద్ర మంత్రులు ఉద్దేశపూర్వకంగా రాజకీయ విమర్శలు చేసినట్టు జల జీవన్ మిషన్ పరోక్షంగా నిర్థారించినట్టయింది. అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి కేటీఆర్.. నీతి ఆయోగ్ సిఫారసు చేసినట్టు మిషన్ భగీరథకు నిధులెందుకు ఇవ్వలేదని నిలదీశారు. అవార్డులు సరే, ఆర్థిక సాయం ఏదీ అంటూ ప్రశ్నించారు. దీంతో కేంద్ర మంత్రుల అహం దెబ్బతింది. గల్లీలో తిడతారు, ఢిల్లీనుంచి అవార్డులు ప్రకటిస్తారంటూ టీఆర్ఎస్ నేతలు విమర్శించడంతో కేంద్రం తప్పుడు ప్రచారానికి దిగింది. వ్యూహాత్మకంగా కొన్ని మీడియా సంస్థల ద్వారా తెలంగాణకు అవార్డు రాలేదంటూ లీకులిచ్చింది. సాక్షాత్తూ జల్ జీవన్ మిషన్ ఈ విషయాన్ని ధృవీకరించిందంటూ కథనాలు వెలువడ్డాయి. కానీ వాస్తవం ఇది అంటూ లేఖ బయటకు రావడంతో కేంద్ర నాయకుల నోటికి తాళం పడింది.

ఫ్యాక్ట్ చెక్ అవసరమా..?

ఒకవేళ ఆ లీకులే నిజమైతే.. ఈ లేఖ అబద్ధం కావాలి. ఈ లేఖే నిజమైతే ఆ లీకులిచ్చినవారు నీచులు అయిఉండాలి. అంటే రాబోయే రోజుల్లో.. కేంద్రం నుంచి ఏదైనా ప్రశంసా పత్రం వచ్చినా, అవార్డు ఇస్తున్నామంటూ లేఖ వచ్చినా.. ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందనమాట.

First Published:  2 Oct 2022 6:56 AM IST
Next Story