తెలంగాణలో నేటినుంచి బూస్టర్ డోస్ పంపిణీ
రద్దీ ప్రాంతాల్లోనూ మొబైల్ వ్యాక్సినేషన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, ఇతర కేంద్రాల వద్ద ప్రత్యేక వాహనాల్లో వీటిని పంపిణీ చేయనున్నారు.
కోవిడ్ మహమ్మారి మరోసారి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో మంగళవారం నుంచి బూస్టర్ డోస్‌ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ టీకాలను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని జిల్లాల అధికారులకూ ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలోని మొత్తం 1,571 కేంద్రాల్లో ప్రత్యేకంగా బూస్టర్ డోస్‌ను ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
మొబైల్ వ్యాక్సినేషన్‌కూ ఏర్పాట్లు..
రద్దీ ప్రాంతాల్లోనూ మొబైల్ వ్యాక్సినేషన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, ఇతర కేంద్రాల వద్ద ప్రత్యేక వాహనాల్లో వీటిని పంపిణీ చేయనున్నారు. 50 మందికి మించి బూస్టర్ డోస్ వేయించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ముందస్తుగా తమకు విజ్ఞప్తి చేస్తే అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తామని వెల్లడించారు.
బూస్టర్ డోస్ వేసుకోవాల్సినవారు 1.60 కోట్ల మంది..
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 1.60 కోట్ల మంది బూస్టర్ డోస్ వేసుకోవాల్సి ఉంది. మరో 9 లక్షల మంది రెండో డోస్ టీకా వేసుకోలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 9.50 లక్షల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రజల్లో ఇప్పుడిప్పుడే బూస్టర్ డోస్‌పై ఆసక్తి పెరుగుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తే మాత్రం ఈ డోస్‌లు సరిపోయే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో కోవిడ్ టీకాలు సరఫరా చేయాలంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.
కొత్తగా 12 మందికి కోవిడ్ పాజిటివ్...
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం నిర్వహించిన 4,367 కరోనా నిర్ధారణ పరీక్షల్లో 12 మందికి కోవిడ్ సోకినట్టు తేలింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8.41 లక్షలకు చేరుకుంది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 8.37 లక్షలకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 65 యాక్టివ్ కేసులు ఉన్నాయి.