Telugu Global
Telangana

కోరమండల్ మహా విషాదం.. 230 మందికి పైగామృతి.. వెయ్యి మందికి గాయాలు

బాలేశ్వర్ సమీపంలో కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు షాలిమార్ నుంచి చెన్నై వెళ్తూ రాత్రి 7 గంటల సమయంలో పట్టాలు తప్పి పక్కన ఉన్న వేరే పట్టాలపై పడింది.

కోరమండల్ మహా విషాదం.. 230 మందికి పైగామృతి.. వెయ్యి మందికి గాయాలు
X

భారత రైల్వే చరిత్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. ఇటీవల కాలంలో ఎన్నడూ చూడని ఘోర రైలు ప్రమాదం ఒడిషాలో జరిగింది. బాలేశ్వర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు 233 మంది మృతి చెందగా, దాదాపు 1000 మంది గాయపడ్డారు. బోగాల్లో ఇంకా చాలా మంది చిక్కుకొని ఉన్నారని సహాయక చర్యలు చేపడుతున్న వారు తెలిపారు. అంతే కాకుండా క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నది. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ శతాబ్దంలో జరిగిన అత్యంత ఘోరమైన రైల్వే ప్రమాదాల్లో ఇది కూడా ఒకటి.

ప్రమాదం ఇలా..

బాలేశ్వర్ సమీపంలో కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు షాలిమార్ నుంచి చెన్నై వెళ్తూ రాత్రి 7 గంటల సమయంలో పట్టాలు తప్పి పక్కన ఉన్న వేరే పట్టాలపై పడింది. అదే సమయంలో యశ్వంత్‌పూర్ నుంచి హౌరా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలపై పడిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలను ఢీకొట్టిందని రైల్వే వర్గాలు చెప్పాయి. రైలు ఢీ కొట్టడం వల్లే ప్రమాద తీవ్రత మరింతగా పెరిగిందని తెలుస్తున్నది.

రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రమాదం జరిగిన నిమిషాల వ్యవధిలోనే అంబులెన్సులు అక్కడకు చేరుకున్నాయి. బాధితుల హహాకారాలతో ఘటనా స్థలం దద్దరిల్లింది. ప్రమాదంలో గాయపడిన దాదాపు 1000 మందిని అంబులెన్సుల్లో భువనేశ్వర్, బాలేశ్వర్, భద్రక్, మయూర్‌బంజ్, కటక్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. బోల్తాపడ్డ బోగీల నుంచి పలువురి మృతదేహాలను బయటకు తీశారు. లోపల ఇంకా వందల సంఖ్యలో చిక్కుకొని ఉన్నట్లు తెలుస్తున్నది. మొత్తం 115 అంబులెన్సులు నిరంతరం క్షతగాత్రులను తరలిస్తూనే ఉన్నాయి.

ఒడిషాలో జరిగిన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, బెంగాల్ సీఎం మమత బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భువనేశ్వర్, కోల్‌కతాల నుంచి సహాయక బృందాలను తరలిస్తున్నట్లు రైల్వే మంత్రి చెప్పారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా నష్ట పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులను రూ.50వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

పలు రైళ్లు రద్దు..

కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఘోర ప్రమాదం నేపథ్యంలో దూర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లన రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. హౌరా - పూరీ సూపర్ ఫాస్ట్, హౌరా - బెంగళూరు సూపర్ ఫాస్ట్, హౌరా - చెన్నై మెయిల్, హౌరా - సికింద్రాబాద్, హౌరా - హైదరాబాద్, హౌరా - తిరుపతి, హౌరా - పూరి సూపర్ ఫాస్ట్, హౌరా - సంబల్‌పూర్, సంత్రగాచి - పూరి ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

బెంగళూరు - గౌహతీ రైలును విజయనగరం, టిట్లాగఢ్, జార్సుగూడ, టాటా మీదుగా దారి మళ్లించారు. ఖరగ్‌పూర్ డివిజన్‌లో ఉన్న చెన్నై సెంట్రల్ - హౌరా రైలును జరోలీ మీదుగా.. వాస్కోడగామా - షాలిమార్, సికింద్రాబాద్ - షాలిమార్ వీక్లీ రైళ్లను కటక్, అంగోల్ మీదుగా దారి మళ్లించారు.

హెల్ప్ లైన్లు..

హౌరా - 033-26382217

ఖరగ్‌పూర్ - 8972079325

బాలేశ్వర్ - 8249591559

చెన్నై - 044-25330952

విశాఖపట్నం - 08912746330, 08912744619

విజయనగరం - 08922-221202, 08922-221206

సికింద్రాబాద్ రైల్ నిలయం - 040-27788516

విజయవాడ - 0866-2576924

First Published:  3 Jun 2023 1:45 AM GMT
Next Story