ఏప్రిల్ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ : ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు
రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కోసం పెద్ద ఎత్తున ఆర్థిక అవసరాలు ఉన్పప్పటికీ.. ఉద్యోగుల విషయంలో ఏనాడూ వివక్ష చూపలేదన్నారు.
తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో ఎన్నో ఏళ్ల నుంచి కాంట్రాక్టు పద్దతిపై ఉద్యోగులుగా పని చేస్తున్న వారికి ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. గతంలోనే సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన మేరకు.. ఏప్రిల్ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసును క్రమబద్దీకరించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర 2023-24 వార్షిక బడ్జెట్‌ను సోమవారం అసెంబ్లీలో హరీశ్ రావు ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వ నిధులలో కోతలు పెడుతూ, అనేక ఆర్థిక ఆంక్షలు పెడుతున్నప్పటికీ.. రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కోసం పెద్ద ఎత్తున ఆర్థిక అవసరాలు ఉన్పప్పటికీ.. ఉద్యోగుల విషయంలో ఏనాడూ వివక్ష చూపలేదన్నారు.
ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఏనాడూ తక్కువ చేయలేదని స్పష్టం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తుల మేరకు కొత్త ఈహెచ్ఎస్ విధానాన్ని తీసుకొని రాబోతున్నట్లు హరీశ్ రావు ప్రకటించారు. ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి అందులో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఉపాధ్యాయ, ఉద్యోగ, రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధులను భాగస్వాములుగా చేస్తామన్నారు.
ఈహెచ్ఎస్‌కు సంబంధించి విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ సవరించబోతున్నామని అన్నారు. దీని వల్ల అనేక మంది ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయని హరీశ్ రావు పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణను ఎలాంటి అవతవకలకు ఆస్కారం లేకుండా పూర్తి చేస్తామని చెప్పారు. అంతా పారదర్శకంగా జరుగుతుందని అన్నారు.
స్థానిక సంస్థల నిధులను ఇకపై నేరుగా ఖాతాల్లోకి బదిలీ చేయడానికి సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు హరీశ్ రావు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి నిధులతో పాటు ఫైనాన్స్ కమిషన్ నిధులను స్థానిక సంస్థల ఖాతాల్లోకే వెళ్తాయని అన్నారు. ఈ సంస్కరణలు అమలు చేయడం వల్ల ఫైనాన్స్, ట్రెజరీల ఆమోదం కోసం వేచి చూడాల్సిన అవసరం ఉండదని.. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు స్వతంత్రంగా నిధులు వినియోగించుకునే అవకాశం కలుగుతుందని అన్నారు.