క్రిస్టియన్ భవన్ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి
బీఆర్‌ఎస్ నాయకుడు మేడె రాజీవ్ సాగర్ డిమాండ్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రిస్టియన్‌ల సంక్షేమం, అభివృద్ధిని విస్మరిస్తోందని బీఆర్‌ఎస్ నాయకుడు మేడె రాజీవ్ సాగర్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఉప్పల్ భగాయత్ లో క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని క్రిస్టియన్ నాయకులతో కలిసి పరిశీలించారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పడు క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి రెండెకరాల స్థలం కేటాయించడంతో పాటు రూ.10 కోట్లు నిధులు కూడా మంజూరు చేసిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భవన నిర్మాణాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. క్రిస్టియన్లను కేవలం ఓట్లు వేసే యంత్రాల్లాగే ఈ ప్రభుత్వం చూస్తోందన్నారు. ఈ భవన నిర్మాణం పూర్తి చేస్తే బీఆర్‌ఎస్ కు పేరు వస్తుందనే కారణంతోనే పనులు చేపట్టడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే భవన నిర్మాణ పనులు ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. మైనారిటీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. ఎన్నికలప్పుడు మైనారిటీల సంక్షేమ బడ్జెట్‌ను రూ. 4 వేల కోట్లకు పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 3,003 కోట్లు మాత్రమే కేటాయించిందని తెలిపారు. అందులో ఇప్పటి వరకు కేవలం రూ. 750 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. ఈ ఏడాది బడ్జెట్ లో మైనార్టీలకు రూ. 4వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ మైనార్టీ యువత, మహిళలకు సబ్సిడీ రుణాలు అందించడానికి సంవత్సరానికి రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలన్నారు. ఫాస్టర్లకు నెలకు రూ. 12 వేల గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చి మత పెద్దలను మోసం చేశారన్నారు. కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన కులగణనలో కావాలనే క్రిస్టియన్ల జనాభా చూపించకుండా మోసం చేసిందన్నారు. క్రిస్టియన్ల జనాభా తెలంగాణలో లేనట్టుగానే ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. వెంటనే రీ సర్వే చేసి క్రిస్టియన్ల జనాభాను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.