రూ.3 కోట్లతో ముస్లిం ఖబరస్తాన్ నిర్మాణం : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఇలాంటి సమస్యలను మున్సిపల్ మంత్రి కేటీఆర్ వద్దకు తీసుకెళ్లామని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.
మైనార్టీల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. హైదరాబాద్ నగరంలో కొత్తగా ఒక ఖబరస్తాన్ కావాలని మైనార్టీ పెద్దలు రిక్వెస్ట్ చేశారు. దీంతో బేగంపేటలోని ఓల్డ్ కస్టమ్స్ కాలనీ ప్రాంతంలో రూ.3 కోట్ల వ్యయంతో ఒక ముస్లిం గ్రేవ్ యార్డ్ నిర్మించడానికి అనుమతులు జారీ చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. ముస్లింలకు ప్రత్యేకమైన శ్మశాన వాటికను నిర్మించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు.
జూలై 1న బేగంపేటలో కొత్త ఖబరస్తాన్ ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని చెప్పారు. ఈ మేరకు ఆదివారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసంలో ముస్లిం ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో తలసాని వెల్లడించారు. హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిచడం, కట్టడాలు ఎక్కువ అవడంతో మృతదేహాలను ఎక్కడ ఖననం చేయాలో తెలియక..ముస్లిం వర్గాల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయని ముస్లిం మత ప్రతినిధులు తలసానికి చెప్పారు. ముఖ్యంగా సికింద్రాబాద్ ప్రాంతంలో ఖబరస్తాన్‌లలో చోటు లేక అనేక ఇబ్బందులు పడుతున్నట్లు మంత్రి దృష్టికి తీసుకొని వచ్చారు.
గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు, ప్రజా ప్రతినిధులను కలిసి తమ సమస్యను విన్నవించామని.. కానీ ఎవరూ పెద్దగా స్పందించలేదని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లడుతూ.. ముస్లింలకు ఖబరస్తాన్ లేకపోవడం వల్ల పడుతున్న ఇబ్బందులు తెలంగాణ ప్రభుత్వం గుర్తించిందని అన్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఇలాంటి సమస్యలను మున్సిపల్ మంత్రి కేటీఆర్ వద్దకు తీసుకెళ్లామని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఈ క్రమంలో ఓల్డ్ కస్టమ్స్ క్వార్టర్స్‌లో రెండు ఎకరాల స్థలం కేటాయించారని.. అక్కడే రూ.3 కోట్ల వ్యవయంతో కబరస్తాన్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తలసాని చెప్పారు.