యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని ఆపేందుకు కుట్ర - మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని ఆపడానికి కుట్ర జరుగుతోందని విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలంటూ NGT తీర్పునివ్వడం తెలంగాణకే కాదు మొత్తం దేశానికి నష్టమని మంత్రి అన్నారు.
యాదాద్రిలో నిర్మిస్తున్న థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని ఆపాలంటూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (NGT) తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అన్ని అనుమతులు తీసుకొని థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే ఆ పవర్ ప్లాంట్ నిర్మాణానికి వేల కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో NGT ఇచ్చిన తీర్పుపై అసహనం వ్యక్తం చేశారు విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి.
ప్రాజెక్టును ఆపేందుకు ఏదో కుట్ర జరుగుతోందనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు జగదీష్ రెడ్డి. ట్రైబ్యునల్ తీర్పు ఏకపక్షంగా ఉందని, అన్ని పర్యావరణ అనుమతులు తీసుకున్న తర్వాతే ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టినప్పటికీ ఈ విధమైన తీర్పు రావడం తెలంగాణకే కాదు మొత్తం దేశానికి నష్టమని మంత్రి అన్నారు.
అన్ని చట్టాలకు లోబడి ఈ ప్లాంట్ నిర్మాణం జరుగుతోందని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు జగదీష్ రెడ్డి. NGT తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని తెలిపారు.