Telugu Global
Telangana

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటును కేంద్రం తిరస్కరించ‌డం వెనక అదానీకి లాభం చేకూర్చే కుట్ర‌

సెప్టెంబర్ 20, 2018న బైలడిలాలో ఇనుప ఖనిజం తవ్వకాన్ని గౌతమ్ అదానీ చేపట్టారు. దీంతో అసలు వ్యూహం మరింత స్పష్టమైంది. వెంటనే, పోస్కో, అదానీ రూ.37,500 కోట్ల ఒప్పందంపై సంతకాలు చేశాయి.

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటును కేంద్రం తిరస్కరించ‌డం వెనక అదానీకి లాభం చేకూర్చే కుట్ర‌
X

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆ వాగ్దానాన్ని ఎందుకు నెరవేర్చలేదు ? తెలంగాణ ప్రభుత్వం బయ్యారం ఉక్కు డిమాండ్ చేసినప్పుడల్లా కేంద్ర బీజేపీ సర్కార్ మౌనం ఎందుకు వహిస్తోంది?

ఆ ఎందుకు అనే ప్రశ్నకు జవాబును తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిశాంక్ బైటపెట్టారు. ఇటీవలి చరిత్రను కొద్దిగా తవ్వి అసలు విషయాన్ని బైటికి తీశారు.

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా బైలడిలా ప్రాంతంలోని మైనింగ్ ప్రాజెక్టుల నుంచి ఇనుప ఖనిజం పొందేందుకు అనుమతి ఇవ్వాలని, తద్వారా పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా బయ్యారం ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ 2015లో కేంద్రానికి పలుమార్లు లేఖ రాసిందని క్రిశాంక్ తెలిపారు. . అయితే, బయ్యారంలో ఇనుప ఖనిజం నిల్వలు సరిపోవడం లేదని, ఇప్పుడక్కడ‌ ఉన్నదంతా 'తక్కువ గ్రేడ్' ఖనిజమేనని బయ్యారం ప్లాంట్ సాధ్యం కాదని కేంద్రం చెప్పింది.

బైలడిల నుంచి ఖనిజాన్ని పొందాలన్న తెలంగాణ అభ్యర్థనను విస్మరించినట్లే, బైలడిల నుంచి బయ్యారం వరకు రైల్వే లైన్ లేదా స్లర్రీ పైప్‌లైన్ కోసం రాష్ట్రం చేసిన సూచనలపై కూడా కేంద్రం నోరు మెదపలేదు.

మరో వైపు మోడి క్యాబినెట్ ఏప్రిల్ 25, 2018 న బైలడిలా నుండి ఇనుప ఖనిజాన్ని దక్షిణ కొరియాలోని పోహాంగ్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన ఉక్కు తయారీ సంస్థ పోస్కో (గతంలో పోహాంగ్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ)కి సరఫరా చేయాలని నిర్ణయించింది. పోస్కో ప్రతి సంవత్సరం బైలాడిలా నుండి 1.2 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని కొనుగోలు చేస్తుంది.

ఇది జరిగిన‌ ఒక నెల తర్వాత, సెప్టెంబర్ 20, 2018న బైలడిలాలో ఇనుప ఖనిజం తవ్వకాన్ని గౌతమ్ అదానీ చేపట్టారు. దీంతో అసలు వ్యూహం మరింత స్పష్టమైంది. వెంటనే, పోస్కో, అదానీ రూ.37,500 కోట్ల ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీనికి కొద్ది రోజుల ముందే పోస్కో సీఈఓ 'క్వాన్ ఓహ్-జూన్' ప్రధాని మోడీని కలిశారు. దీన్ని బట్టి అదానీ బైలాడిలాను స్వాధీనం చేసుకోవడానికి , దక్షిణ కొరియా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడానికి కేంద్రం ఎలా సహాయపడిందో అర్దమవుతుంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ఇనుప ఖనిజాన్ని 500 కి.మీ దూరంలోని బైలాడిలా నుండి తీసుకెళ్తుంది. కానీ బయ్యారానికి కేవలం 180 కిలోమీటర్ల దూరం ఉన్న అదే బైలడిలా నుండి ఇనుప ఖనిజాన్ని తీసుకొస్తామని తెలంగాణ ప్రతిపాదిస్తే కేంద్రం నిరాకరించింది. పైగా బైలడిలా లో ఉన్నది తక్కువ గ్రేడ్ ఇనుప ఖనిజమని కేంద్ర నాయకులు చెప్పారు. .

“బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామ‌ని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో చేసిన వాగ్దానాన్ని మోడీ ప్రభుత్వం అమలు చేయడానికి ఎందుకు నిరాకరించిందో ఇప్పుడు మనకు అర్దమవుతుంది. మోడీ జీకి దేశం కంటే అతని ఆశ్రిత ప్రయోజనాలే ఎక్కువ కావడం సిగ్గుచేటు’’ అని క్రిశాంక్ ట్విట్టర్ పోస్ట్ పై స్పందించిన పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్‌ చేశారు.


First Published:  18 Feb 2023 3:17 PM GMT
Next Story