రాజ్‌భవన్ పై కుట్ర! తమిళిసై సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై విరుచుకపడ్డారు. ప్రభుత్వం తనపై దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. గవర్నర్ తన పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఆమె పలు బిల్లులను కూడా పెండింగ్ లో ఉంచినట్టు వాళ్లు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ వ్యవహారంలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని గవర్నర్ తన కార్యాలయానికి రావాల్సిందిగా ఆదేశించినట్టు వార్తలు వచ్చాయి. కాగా తనకు ఈ విషయంపై ఎటువంటి సమాచారం లేదని మంత్రి సబిత చెప్పారు.
కాగా ఇవాళ సాయంత్రం గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు వ్యవహారంలో రాజ్‌భవన్ పేరును లాగాలని చూశారని ఆరోపించారు. ఫామ్ హౌస్ కేసులో మొదట తుషార్ పేరును ఆ తర్వాత రాజ్ భవన్ పేరును ప్రస్తావించారని అన్నారు. తుషార్ గతంలో తన ఏడీసీగా పని చేశారని, తుషార్ తనకు ఫోన్ చేసి దీపావళి శుభాకాంక్షలు చెప్పారని అంత మాత్రం దానికే రాజ్ భవన్ పేరును కేసులోకి లాగుతారా? అని ప్రశ్నించారు.
ఈ కేసులో రాజ్ భవన్ తో సంబంధాలు ఉన్నాయనే అనుమానం ఉందని టీఆర్ఎస్ అఫిషియల్ ట్విట్టర్ ఖాతాలో పోస్టులు రావడం ఏంటని ప్రశ్నించారు. తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారనే అనుమానాలు తనకు ఉన్నాయని కామెంట్స్ చేశారు.రాష్ట్రంలో గవర్నర్ విషయంలో అప్రజాస్వామిక పరిస్థితులు నెలకొన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చేందుకు తాను ఇవాళ మీడియా ముందుకు వచ్చానన్నారు.
బిల్లులు పెండింగ్ లో పెట్టాననడంలో నిజం లేదు:
తన వద్దకు వచ్చిన బిల్లులను తొక్కిపెడుతున్నట్టు వస్తున్న ఆరోపణలను గవర్నర్ ఖండించారు. బిల్లులపై సందేహాలను నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని..అందువల్లే బిల్లుల ఆమోదానికి ఆలస్యం అయిందని ఆ లోపే తనపై తప్పుడు ప్రచారం ప్రారంభమైందని అన్నారు. యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బిల్లుకే తాను మొదటి ప్రాధాన్యత ఇచ్చానని చెప్పారు. రిక్రూట్మెంట్ బిల్లుపై క్లారిఫికేషన్ కోరానని చెప్పారు. కొత్త విధానం అవసరమా కాదా అని పరిశీలిస్తున్నట్టు చెప్పారు.
ఎనిమిదేళ్లుగా అనేక వీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతోనూ తాను మాట్లాడానని చెప్పారు. ఆ తర్వాతే డిటైల్డ్ రిపోర్ట్ రూపొందించి ప్రభుత్వానికి పంపానన్నారు.కొత్త రిక్రూట్ మెంట్ బోర్డు ఏర్పాటుతో ఎలాంటి ఇబ్బదులు వస్తాయి?.. అసలు యూజీసీ నిబంధనలకు లోబడే ఉంటుందా? లీగల్ గా ఇబ్బందులు వస్తే పరిస్థితి ఏంటి? మళ్లీ నియామకాలు ఉంటాయా? బోర్డు ఏర్పాటులో ఎలాంటి ప్రోటోకాల్ పాటిస్తారు? అని క్లారిఫికేషన్ కోరానన్నారు. ఈ విషయంలో మంత్రి తనకు సమాచారం రాలేదని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
రాజ్ భవన్ తలుపులు తెరిచే ఉంటాయి:
తాను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాననే వార్తల్లో నిజం లేదన్నారు గవర్నర్. తన పర్యటనలకు సంబంధించిన సమాచారం ముందే ఇస్తున్నా కలెక్టర్లు, ఎస్పీలు వాటిని పాటించడం లేదని, ఆ విషయం ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తమిళిసై అన్నారు..
కొంతమంది కావాలనే రాజ్ భవన్ ప్రతిష్ఠను తగ్గించాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాజ్ భవన్ ముందు ధర్నా చేస్తామని విద్యార్థుల ఐకాస పేరిట వార్తలు రావడంపై స్పందించిన గవర్నర్.. రాజ్ భవన్ తలుపులు ఎప్పుడు తెరుచుకునే ఉంటాయని అన్నారు. అయితే ఇప్పుడు ధర్నాలు చేస్తామంటున్న వాళ్లు గత ఎనిమిదేళ్లుగా ప్రభుత్వం వీసీలను నియమించనప్పుడు ఎందుకు నిరసనలు తెలపలేదని ప్రశ్నించారు.