మానుకోటలో బీఆర్‌ఎస్ ఫ్లెక్సీలను చింపిన కాంగ్రెస్ కార్యకర్తలు
మానుకోటలో బీఆర్ఎస్ పార్టీ మహా ధర్నా జరగనున్న నేపథ్యంలో ఫ్లెక్సీల రగడ జరుగుతోంది. కేటీఆర్ ఫ్లెక్సీలను కాంగ్రెస్ కార్యకర్తలు చింపిన వేశారు.
మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ మహా ధర్నా జరగనున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కాంగ్రెస్ కార్యకర్తలు చింపివేశారు. ఈ మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. అయితే మాజీ మంత్రి మానుకోట పర్యటనపై గత రెండు రోజులుగా నిరసనలు, ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేటీఆర్ ఫ్లెక్సీని చించేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ మహాధర్నా
నేపథ్యంలో జిల్లాలో అవాంచిత ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు పోలీసులు సంసిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. లగచర్ల ఘటనతో పాటు రాష్ట్రంలో గిరిజనులు, దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా మహబూబాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తోంది. మానుకోట బీఆర్ఎస్ పార్టీ చేపట్టనున్న గిరిజన రైతు మహా ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గిరిజన రైతు ధర్నాకు అనుమతించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ధర్నా చేపట్టేందుకు న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. వెయ్యి మందితో ధర్నా చేపట్టొచ్చని కోర్టు స్పష్టం చేసింది. అయితే బీఆర్ఎస్ మాత్రం 50 వేల మందితో మహా ధర్నా చేపడతామని మొదట ప్రకటించింది