Telugu Global
Telangana

ఎల్బీ స్టేడియంలో టీడీపీ జెండాలు.. చితకబాదిన కాంగ్రెస్ శ్రేణులు

రేవంత్ రెడ్డి సీఎం అయితే.. టీడీపీ ఎక్కువగా సంబరపడిపోతోంది. చంద్రబాబు శిష్యుడు సీఎం అయ్యారంటూ ప్రొజెక్ట్ చేసుకోవాలని చూస్తోంది. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం టీడీపీ ఓవర్ యాక్షన్ ని సహించడంలేదు.

ఎల్బీ స్టేడియంలో టీడీపీ జెండాలు.. చితకబాదిన కాంగ్రెస్ శ్రేణులు
X

తెలంగాణ ఫలితాలు వెలువడిన రోజు.. గాంధీ భవన్ లో కాంగ్రెస్ జెండాలకు తోడు టీడీపీ జెండాలు కూడా రెపరెపలాడాయి. రేవంత్ రెడ్డి విజయ యాత్రలో కూడా పచ్చ జెండాలు కనిపించాయి. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి ఏంటని.. వైసీపీ నుంచి కౌంటర్లు కూడా పడ్డాయి. అక్కడితో ఆ వ్యవహారం ముగిసిపోలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎల్బీ స్టేడియంలో కూడా టీడీపీ జెండాలు రెపరెపలాడే ప్రయత్నం చేశాయి. అయితే కాంగ్రెస్ శ్రేణులు జెండాలు ఊపుతున్న టీడీపీ అభిమానుల్ని తరిమి తరిమి కొట్టారు. స్టేడియంలో ఎక్కడా పచ్చ జెండా ఎగరడానికి వీలు లేదన్నారు. టీడీపీ అభిమానుల్ని చితకబాదారు. ఏపీనుంచి వచ్చిన కొంతమంది టీడీపీ జెండాలు పట్టుకుని హల్ చల్ చేయాలనుకున్నా, చివరకు తన్నులు తిని బయటపడ్డారు.

ఎల్బీ స్టేడియంలో హడావిడి..

కాంగ్రెస్ గెలిచిన రోజు టీడీపీ హడావిడిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తమ విజయంతో వారు పండగ చేసుకుంటుంటే పోనీలెమ్మని ఊరుకున్నారు. ఈరోజు ఎల్బీ స్టేడియంలో జరిగింది పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ అధికారిక కార్యక్రమం. అయితే గియితే అక్కడ కాంగ్రెస్ జెండాలు ఎగరాలి. కానీ సందడ్లో సడేమియా అంటూ టీడీపీ వాళ్లు హడావిడి చేశారు. పెద్ద పెద్ద జెండాలు తీసి స్టేడియంలో సందడి చేయాలని చూశారు. దీంతో కాంగ్రెస్ సీనియర్ లీడర్లకు మండింది. తమ కార్యక్రమంలో టీడీపీ జెండాలేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకుల సూచనతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆ జెండాలు ఊపేవారిని చితకబాదారు. దీంతో వారంతా చల్లగా అక్కడినుంచి జారుకున్నారు.

ఇకనైనా ఆపుతారా..?

రేవంత్ రెడ్డి సీఎం అయితే.. టీడీపీ ఎక్కువగా సంబరపడిపోతోంది. చంద్రబాబు శిష్యుడు సీఎం అయ్యారంటూ ప్రొజెక్ట్ చేసుకోవాలని చూస్తోంది. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం టీడీపీ ఓవర్ యాక్షన్ ని సహించడంలేదు. ఈ విషయంపై ఈరోజు ఎల్బీ స్టేడియం ఘటనతో మరింత క్లారిటీ వచ్చింది ఇకపై టీడీపీ నేతలెవరూ రేవంత్ మా వాడు, మా బ్రాండ్, మా చంద్రబాబు శిష్యుడు అంటే.. కాంగ్రెస్ నేతలు ఊరుకునేలా లేరు. ఇటు వైసీపీ కూడా సెటైర్లతో విరుచుకుపడుతోంది.

First Published:  7 Dec 2023 10:43 AM GMT
Next Story