Telugu Global
Telangana

హనుమాన్ చాలీసా మొదలు పెట్టేలోపు పోలీసులొచ్చేశారు

గాంధీభవన్ ముందు నిలబడి హనుమాన్ చాలీసా పఠించేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులకు, బ‌జరంగ్ దళ్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది.

హనుమాన్ చాలీసా మొదలు పెట్టేలోపు పోలీసులొచ్చేశారు
X

తాము అధికారంలోకి వస్తే బ‌జరంగ్ దళ్ ని నిషేధిస్తామంటూ కర్నాటక అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దీనిపై బీజేపీ గొడవ చేస్తోంది. ప్రధాని మోదీ కూడా కాంగ్రెస్ హామీపై మండిపడ్డారు. బ‌జరంగ్ దళ్ పై వేటు వేస్తామని చెప్పడం సరికాదన్నారు, కాంగ్రెస్ పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఈ దశలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ల ముందు బీజేపీ, బ‌జరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. సామూహికంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ల ముందు హనుమాన్ చాలీసా పఠించాలనుకున్నారు బ‌జరంగ్ దళ్ కార్యకర్తలు. కానీ అంతలోనే పోలీసులు రంగప్రవేశం చేశారు. బీజేపీ, బ‌జరంగ్ దళ్ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ, బ‌జరంగ్ దళ్ నేతలు కలసి కాంగ్రెస్ కార్యాలయాల ముందు ఈరోజు నిరసన ప్రదర్శన చేపట్టాలనుకున్నారు. హనుమాన్ చాలీసా పఠించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో బ‌జరంగ్ దళ్, బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ గాంధీభవన్ వద్దకు చేరుకున్నారు. గాంధీభవన్ ముందు నిలబడి హనుమాన్ చాలీసా పఠించేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులకు, బ‌జరంగ్ దళ్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. పలువురిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. గాంధీభవన్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు.

రంగంలోకి మహిళా కాంగ్రెస్..

మరోవైపు కాంగ్రెస్ నుంచి బీజేపీ ఆందోళనలపై అదే స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గాంధీభవన్‌ వద్ద మహిళా కాంగ్రెస్‌ నేతలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కూడా బీజేపీ ఆందోళనలను కాంగ్రెస్ నేతలు అడ్డుకోవాలని చూశారు. పోలీసులు కలుగజేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు.

First Published:  5 May 2023 2:55 PM IST
Next Story