Telugu Global
Telangana

12 గంటల్లోనే రాజగోపాల్‌కు టికెట్‌.. చలమల్ల, పాల్వాయి దారెటు..?

మొన్నటివరకు టికెట్ తనదేనని భావించిన చలమల్ల కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు సమాచారం. ఇప్పటికే అనుచరులతో సమావేశమైన చలమల్ల భవిష్యత్‌ కార్యాచరణపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

12 గంటల్లోనే రాజగోపాల్‌కు టికెట్‌.. చలమల్ల, పాల్వాయి దారెటు..?
X

కాంగ్రెస్‌ సెకండ్‌ లిస్ట్‌లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేసింది. అందులో బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరు. కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న 12 గంటల వ్యవధిలోనే ఆయనకు మునుగోడు టికెట్ కేటాయిస్తూ సెకండ్‌ లిస్ట్‌లో చోటిచ్చింది హస్తం పార్టీ. అయితే ఈ అంశం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచిన రాజగోపాల్‌ రెడ్డి.. 2021లో ఆ పార్టీకి రాజీనామా చేశారు. తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యారు. బీజేపీ తరపున మునుగోడు బైపోల్‌లో బరిలో దిగిన రాజగోపాల్ రెడ్డి.. బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అయితే శుక్రవారం మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరి.. మరోసారి టికెట్ అందుకున్నారు రాజగోపాల్ రెడ్డి.

అయితే మొన్నటివరకు టికెట్ తనదేనని భావించిన చలమల్ల కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు సమాచారం. ఇప్పటికే అనుచరులతో సమావేశమైన చలమల్ల భవిష్యత్‌ కార్యాచరణపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రేవంత్‌కు ప్రధాన అనుచరుడుగా ఉన్న చలమల్ల బీజేపీ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. మరోవైపు బైపోల్‌ సమయంలో పాల్వాయి స్రవంతిని బరిలోకి దించిన కాంగ్రెస్‌.. మరోసారి అవకాశం ఇస్తానని అప్పుడే హామీ ఇచ్చింది. అయితే ఈసారి చలమల్లతో పాటు పాల్వాయి స్రవంతికి పార్టీ మొండి చేయి చూపింది. దీంతో ఈ ఇద్దరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

First Published:  28 Oct 2023 10:12 AM IST
Next Story