Telugu Global
Telangana

నిజామాబాద్‌ అర్బన్‌ సీటు.. తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్‌.!

నిజామాబాద్ అర్బన్ సీటు బీసీలకు కంచుకోటగా ఉంది. గతంలో ఇక్కడి నుంచి పీసీసీ మాజీ చీఫ్‌ డి.శ్రీనివాస్, డి.సత్యనారాయణ, సతీష్‌ పవార్‌ లాంటి బీసీ నేతలు ప్రాతినిథ్యం వహించారు.

నిజామాబాద్‌ అర్బన్‌ సీటు.. తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్‌.!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఇప్పటికే 100 మంది అభ్యర్థులను ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న 19 స్థానాల్లో నిజామాబాద్‌ అర్బన్ ఒకటి. నిజామాబాద్ అర్బన్ సీటును మైనార్టీలకు ఇస్తారన్న ప్రచారంతో స్థానిక నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో దాదాపు దశాబ్దాలుగా బీసీల ఆధిపత్యం కొనసాగుతోంది. ముస్లిం జనాభా అత్యధికంగా ఉందన్న కారణంతో మైనార్టీ అభ్యర్థిని బరిలోకి దింపితే కాంగ్రెస్‌కు షాక్‌ తప్పదన్న ప్రచారం జరుగుతోంది.

2018లోనూ మైనార్టీ ఓట్లను దృష్టిలో ఉంచుకుని నిజామాబాద్ అర్బన్‌ స్థానం నుంచి తాహెర్‌ బిన్‌ హమ్దాన్‌ను బరిలో ఉంచింది కాంగ్రెస్‌. అయితే తాహెర్‌ బిన్‌పై బీఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా విజయం సాధించారు. ఇప్పుడు మళ్లీ ఈ సీటును మైనార్టీలకే ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. కామారెడ్డి నుంచి రేవంత్ బరిలో ఉంటే.. కాంగ్రెస్‌ సీనియర్ నేత షబ్బీర్ అలీని నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయించే ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లు సమాచారం. గతంలో కామారెడ్డి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన షబ్బీర్‌ అలీ మంత్రిగానూ పనిచేశారు. 2010 ఉపఎన్నికలో ఎల్లారెడ్డి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి షబ్బీర్ అలీని బరిలో ఉంచితే షాక్ తప్పదంటున్నారు పార్టీలోని ఓ వర్గం నేతలు.

నిజామాబాద్ అర్బన్ సీటు బీసీలకు కంచుకోటగా ఉంది. గతంలో ఇక్కడి నుంచి పీసీసీ మాజీ చీఫ్‌ డి.శ్రీనివాస్, డి.సత్యనారాయణ, సతీష్‌ పవార్‌ లాంటి బీసీ నేతలు ప్రాతినిథ్యం వహించారు. ఈ నియోజకవర్గం పరిధిలో మున్నూరు కాపులు అత్యధికంగా ఉన్నారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో.. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, బోధన్ స్థానాల్లో రెడ్డిలకు అవకాశం కల్పించింది కాంగ్రెస్‌. దీంతో నిజామాబాద్ అర్బన్ సీటుపై కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని బీసీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

First Published:  30 Oct 2023 3:47 AM GMT
Next Story