బీసీలను టార్గెట్ చేసిన కాంగ్రెస్.. బీసీ గర్జనకు ప్లాన్.. ప్లేస్ ఎక్కడంటే?
అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు చెప్పుకోదగిన సీట్లు ఇవ్వడానికి టీపీసీసీ సూచనల మేరకు అధిష్టానం అంగీకరించినట్లు తెలుస్తున్నది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల కోసం సన్నద్దం అవుతోంది. ఇప్పటికే తొలి విడతలో 80 స్థానాలకు టికెట్ల ప్రకటించడంపై చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకున్నది. మరో నాలుగైదు రోజుల్లోనే తొలి జాబితా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు తమ అసంతృప్తిని పెద్దగా బయటపెట్టకుండా సర్థుకొని పోతున్నారు. అయితే బీసీ నాయకులు మాత్రం కాస్త అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు భారీగా టికెట్లు ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు చెప్పుకోదగిన సీట్లు ఇవ్వడానికి టీపీసీసీ సూచనల మేరకు అధిష్టానం అంగీకరించినట్లు తెలుస్తున్నది. ప్రతీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో వీలున్న చోట్ల రెండు అసెంబ్లీ సీట్లు బీసీలకు కేటాయించడానికి సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తున్నది. తెలంగాణలో ఉన్న 17 లోక్‌సభ పరిధిలో 34 మంది బీసీలకే టికెట్లు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఖమ్మం, ఆదిలాబాద్ వంటి ఉమ్మడి జిల్లాల్లో రిజర్వుడు సీట్లే ఎక్కువగా ఉన్నాయి. అలాంటి జిల్లాల్లో ఒకే సీటు ఇచ్చే అవకాశం ఉన్నది. అలా కుదరక పోతే ఇతర జిల్లాల్లో సర్థుబాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నది.
ఇటీవల తుక్కుగూడలో నిర్వహించిన సభకు అనూహ్య స్పందన రావడంతో మరో సభను ఏర్పాటు చేయాలని టీపీసీసీ నిర్ణయించింది. ఇప్పటికే ఎస్పీ, ఎస్టీ, మహిళ, రైతు యువకులకు సంబంధించి డిక్లరేషన్లు ప్రకటించింది. ఈ సారి బీసీలకు ప్రాధాన్యత ఇచ్చేలా భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నది. హైదరాబాద్‌కు సమీపంలో బెంగళూరు రహదారిపై ఉన్న షాద్‌నగర్ వద్ద బీసీ గర్జన ఏర్పాటు చేయడానికి పార్టీ అధిష్టానం కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తున్నది.
కర్ణాటకలో దళిత, బహుజన, ఓబీసీ వర్గాల్లో గట్టి పట్టున్న నేతగా పేరున్న సీఎం సిద్ధ రామయ్యను ఈ సభకు ముఖ్య అతిథిగా పిలిచే అవకాశం ఉన్నది. కర్ణాటక తరహాలోనే ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. బీసీ గర్జన సభ నిర్వహించడం ద్వారా ఆ వర్గం ఓటర్లను ఆకర్షించగలుగుతామని అంచనా వేస్తోంది. బీసీ గర్జన ద్వారా తెలంగాణ బీసీల్లో నూతనోత్సాహం వస్తుందని కూడా కాంగ్రెస్ భావిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన డేట్లను ఫిక్స్ చేసి ప్రకటిస్తారని తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.