Telugu Global
Telangana

రెబల్స్‌ విషయంలో కాంగ్రెస్‌ సక్సెస్‌..!

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ, జుక్కల్‌ స్థానాల్లో రెబల్స్‌గా నామినేషన్ వేసిన బాల్‌రాజ్, గంగారామ్‌లు నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు.

రెబల్స్‌ విషయంలో కాంగ్రెస్‌ సక్సెస్‌..!
X

పార్టీ తనకు టికెట్ ఇవ్వలేదన్న అసంతృప్తితో రెబల్ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన వారిని బుజ్జగించడంలో కాంగ్రెస్‌ దాదాపు సక్సెస్‌ అయింది. సూర్యాపేట సహా మొత్తం 24 స్థానాల్లో తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. ఒక్క ఆదిలాబాద్‌ మినహా అన్ని స్థానాల నుంచి రెబల్స్ తప్పుకున్నారు.

సూర్యాపేట టికెట్ దక్కకపోవడంతో ఆల్‌ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ తరపున నామినేషన్ వేసిన పీసీసీ ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి.. ఉద్రిక్తతల మధ్య నామినేషన్‌ విత్‌డ్రా చేసుకున్నారు. రమేష్‌ రెడ్డిని ఎన్నికల బరి నుంచి తప్పించేందుకు పార్టీ నేతలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఆయనకు అధిష్టానం నల్లగొండ ఎంపీ టికెట్ ఇస్తామని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇక మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి సైతం పటేల్‌ రమేష్‌ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలని అధిష్టానానికి లేఖలు రాశారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ, జుక్కల్‌ స్థానాల్లో రెబల్స్‌గా నామినేషన్ వేసిన బాల్‌రాజ్, గంగారామ్‌లు నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. ఇక ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్‌ రెబల్‌గా నామినేషన్‌ వేసిన దండెం రాంరెడ్డి సైతం వెనక్కి తగ్గారు.

ఆదిలాబాద్‌లో రెబల్‌ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అల్లూరి సంజీవ రెడ్డి విషయంలో పార్టీ బుజ్జగింపులు ఫలించలేదు. బరిలో ఉండేందుకే ఆయన మొగ్గుచూపారు. ఆదిలాబాద్‌ టికెట్‌ను కంది శ్రీనివాస్‌కు కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. దీంతో సంజీవ రెడ్డి రెబల్‌గా నామినేషన్ వేశారు.

First Published:  16 Nov 2023 8:31 AM IST
Next Story